డ్రైవర్ లేకుండానే మెట్రో రయ్ రయ్

7 Apr, 2016 23:04 IST|Sakshi
డ్రైవర్ లేకుండానే మెట్రో రయ్ రయ్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో డ్రైవర్ రహిత రైళ్లు పట్టాలెక్కనున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లను బుధవారం ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పరీక్షించింది. ఫేస్ 3 కింద రెండు కారిడార్లను ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. వైఫై సౌకర్యం, సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక యూఎస్బీ డివైస్ అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది చివరికల్లా డ్రైవర్ లేకుండా నడిచే ఈ మెట్రో రైళ్లు రాజధానిలో పరుగులు పెట్టనున్నాయని మెట్రో ఎండీ మంగు సింగ్ వెల్లడించారు. మొదటగా డ్రైవర్ పర్యవేక్షణలో ఓ ఏడాది రైళ్లను నడిపి 100 శాతం సక్సెస్ సాధించాక డ్రైవర్ రహిత రైళ్లను ప్రారంభిస్తామన్నారు. దక్షిణ కొరియాలో తయారైన ఐదు డ్రైవర్ రహిత రైళ్లను ఇటీవలే దిగుమతి చేసుకున్నారు. ఇవి ఇప్పటికే ఢిల్లీలోని ముకుంద్పూర్ డిపోకు చేరుకున్నాయి. మరో మూడు రైళ్లు 'సిగ్నలింగ్ సిస్టమ్, ఎలెక్ట్రికల్ ఫిటింగ్స్తో అనుసంధానించి డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షించనున్నారు.

స్పెషల్ రైళ్లు ఒక్కసారి 1866 మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చుతాయి. డ్రైవర్ క్యాబిన్ తీసివేయడంతో 40 మంది ప్రయాణించేందుకు అవకావం ఉంది. ఈ రైళ్లకు 6 కోచ్లు ఉంటాయి. మజ్లిస్ పార్క్-శివ్ విధార్ ల మధ్య 58.5 కిలోమీటర్లు, నొయిడాలోని బొటానికల్ గార్డెన్-జానక్పూరి పశ్చిమ ఢిల్లీ ల మధ్య 38 కి.మీ మేర ఇప్పటికే ట్రయల్ రన్ సాఫీగా సాగిపోతున్న విషయం తెలిసిందే. ఫేస్ 3లో డ్రైవర్ రహిత రైళ్లను ప్రవేశపెట్టే సమయంలో ప్రాథమిక పరీక్షల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. అయితే పరీక్షలన్నీ పూర్తయ్యాక సిబ్బంది లేకుండా రైళ్లను నడుపుతాం' అని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఓ ప్రతినిధి చెప్పారు. 56 కిలో మీటర్ల దూరాన్ని 12 నిమిషాల్లో చేరుకునే వేగంతో ఈ రైళ్లు పరుగులు పెట్టడం విశేషం.
 

మరిన్ని వార్తలు