'వాళ్లెవరూ మెట్రో రైల్లో ఎక్కకూడదు'

28 May, 2016 08:44 IST|Sakshi
'వాళ్లెవరూ మెట్రో రైల్లో ఎక్కకూడదు'

ఢిల్లీ మెట్రో రైలు అధికారులు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. మానసిక ఆరోగ్యం బాగోలేనివాళ్లు, కొన్ని రకాల వ్యాధులతో బాదపడేవాళ్లు తమ రైళ్లలో ఎక్కకూడదని చెప్పారు. కుష్టువ్యాధి ఉన్నవాళ్లు ఆ వ్యాధి ఎవరికీ అంటుకోదని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌తో సర్టిఫికెట్ తెచ్చిన తర్వాత మాత్రమే మెట్రో రైలు ఎక్కాలని చెప్పారు. ఈ నిబంధనలతో కూడిన పోస్టర్లను ఢిల్లీ మెట్రో పలుచోట్ల అతికించింది. అంటువ్యాధులు ఉన్నవాళ్లు తమ రైళ్లలో ఎక్కకూడదని స్పష్టం చేసింది. సెరెబ్రో స్పైనల్ మెనింజైటిస్, చికెన్ పాక్స్, డిఫ్తీరియా, మంప్స్, టైఫస్, దగ్గు, కలరా, మీజిల్స్, స్కార్లెట్ జ్వరం, టైఫాయిడ్, టీబీ.. ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్లు రైళ్లు ఎక్కడానికి వీల్లేదని తెలిపింది.

దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ ఈ ఆదేశాలను తీవ్రంగా విమర్శించింది. ఇది చాలా వివక్షాపూరితమని, ఢిల్లీ మెట్రో తీరును బయటపెడుతోందని మానస్ ఫౌండేషన్ ట్రస్టీ, సైకాలజిస్టు అయిన నవీన్ కుమార్ అన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకూడా ఇచ్చిందని ఆయన చెప్పారు. అయితే, ఇన్నీ ఢిల్లీ మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలేనని, కొత్తగా వేటినీ సృష్టించలేదని మెట్రో అధికారి ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు