కేజ్రీ లంచం తీసుకున్నారు!

8 May, 2017 00:26 IST|Sakshi
కేజ్రీ లంచం తీసుకున్నారు!

మంత్రి సత్యేంద్ర జైన్‌ రూ. 2 కోట్లు ఇచ్చారు
- నేను ప్రత్యక్ష సాక్షి: బహిష్కృత మంత్రి కపిల్‌ మిశ్రా
- ఆరోపణలు అర్థరహితమన్న సిసోడియా


న్యూఢిల్లీ: ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై బహిష్కృత ఢిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రా సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. మరో కేబినెట్‌ సహచరుడు ఢిల్లీ వైద్య మంత్రి సత్యేంద్ర జైన్‌ నుంచి తన కళ్లముందే రూ.2కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. దీంతోపాటు కేజ్రీవాల్‌ ప్రభుత్వంలోని అవకతవకలపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు వివరాలు అందజేసినట్లు మిశ్రా తెలిపారు. కేజ్రీవాల్‌పై చేసిన ఈ ఆరోపణలతో ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. ఆప్‌ సీనియర్‌ నేత కుమార్‌ విశ్వాస్‌ ఇటీవలే పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మిశ్రా అవినీతి ఆరోపణలు చేయటంతో ఆమ్‌ ఆద్మీ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వంలో, పార్టీలో మార్పులు చేస్తున్న కేజ్రీవాల్‌.. శనివారమే మిశ్రాను మంత్రి పదవినుంచి తప్పించారు. మిశ్రా ఆరోపణలను ఆప్‌ ఖండించింది. మంత్రి వర్గం నుంచి తొలగించారన్న అక్కసుతోనే మిశ్రా అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా స్పష్టం చేశారు. ‘సరైన పనితీరు లేనికారణంగానే ఆయన్ను తొలగించాం. స్పందించాల్సి నంత స్థాయి ఆరోపణేం కాదిది. ఇందులో వాస్తవం లేదు’ అని అన్నారు.

రాజకీయాల్లో సహజమేనన్నారు!
కేజ్రీవాల్‌ నివాసంలోనే డబ్బులు ఇచ్చారని కపిల్‌ మిశ్రా ఆరోపించారు. ‘రెండ్రోజుల క్రితం (మే 5న) కేజ్రీవాల్‌కు ఆయన నివాసంలోనే సత్యేంద్ర జైన్‌ రూ.2 కోట్లు ఇచ్చారు. అది కూడా నా కళ్లముందే. ఇదేంటని కేజ్రీవాల్‌ను అడిగితే రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనన్నారు. దీని వివరాలు మళ్లీ చెబుతానన్నారు. సత్యేంద్ర జైన్‌ కూడా.. కేజ్రీవాల్‌ బంధువుల భూవివాదాన్ని రూ. 50 కోట్లకు సెటిల్‌ చేసినట్లు వ్యక్తిగతంగా నాకు చెప్పారు. ఇదేంటని మళ్లీ కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తే.. జైన్‌ చెప్పినవన్నీ అబద్ధాలు. నన్ను నమ్ము అన్నారు’ అని రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన అనంతరం మిశ్రా వెల్ల డించారు. కొంతకాలంగా పార్టీలో అవినీతిపై నాయకులపై ఒత్తిడి తెస్తున్నందునే తనను మంత్రి పదవినుంచి తొలగించారన్నారు. ‘నీటి సరఫరా మంత్రిగా నేను తప్పుచేసుంటే.. కేజ్రీవాల్, సిసోడియా ఎందుకు ఈ విషయంపై చర్చించలేదు. ఢిల్లీలో వారి ప్రభుత్వం ప్రజలకు గొప్పగా చేసిందని ప్రజలను ఎందుకు మభ్యపెట్టారు’ అని మిశ్రా ప్రశ్నించారు.

చాలా కాలంగా పార్టీ ఫండింగ్, పంజాబ్‌ ఎన్నికలు, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి వివిధ రకాల అవినీతి ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. ‘వీటిలో కొన్నింటిని నేను కళ్లారా చూశాను. కానీ కేజ్రీవాల్‌కు అవినీతి మరక అంటదని భావించాను. మనీలాండరింగ్, నల్లధనం, మంత్రి జైన్‌ తన కూతురినే ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవటం, లగ్జరీ బస్సుల పథకం, సీఎన్‌జీ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ కుంభకోణం.. వంటివన్నీ కేజ్రీవాల్‌ కనుసన్నల్లోనే జరిగాయి. ఆయన చర్యలు తీసుకుంటారనే అనుకున్నా’ అని మిశ్రా ఆరోపించారు.  అన్ని ఆధారాల్ని సోమవారం ఏసీబీకి అందచేస్తానని పేర్కొన్నారు. ఆప్‌ తనపార్టీ అని.. ఇందులోనుంచి తననెవరూ బయటకు పంపించలేరన్నారు. పార్టీ నుంచి అవినీతిని తరిమేసే పనిని రాజ్‌ఘాట్‌ నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.  

రాజీనామాకు విపక్షాల డిమాండ్‌
అవినీతిపై యుద్ధమంటూ ఆప్‌ను స్థాపించిన కేజ్రీవాల్‌.. తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. కపిల్‌ మిశ్రా ఆరోపణలు తీవ్రమైనవని.. సీబీఐ, ఏసీబీతో వీటిపై విచారణ జరిపించాలని ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ అన్నారు. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ స్పందిస్తూ.. పాలనకన్నా జేబులు నింపుకోవటంలోనే కేజ్రీవాల్‌కు ఆసక్తి ఉందన్నారు. అటు బీజేపీ కూడా కేజ్రీవాల్‌కు సీఎంగా కొనసాగే నైతిక హక్కులేదంది.

ఆరోపణలు బాధించాయి: హజారే
ఢిల్లీ సీఎం, తన మాజీ శిష్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలు తననెంతగానో బాధిస్తున్నాయని.. సామాజికవేత్త అన్నా హజారే తెలిపారు. ‘టీవీల్లో వస్తోంది చూస్తుం టే చాలా బాధగా ఉంది’ అని రాలేగావ్‌ సిద్ధిలో హజారే తెలిపారు. ‘అవినీతిపై ఉద్యమం కారణంగానే ఢిల్లీలో కేజ్రీవాల్‌ సీఎం అయ్యారు. కానీ నేడు కేజ్రీవాల్‌పైనే ఆరోపణలు రావటం చాలా బాధనిపిస్తోంది. దీనిపై ఎలా స్పందించాలో తెలియటం లేదు. మిశ్రా ఆరోపణలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే దీనిపై స్పందిస్తా’ అని అన్నా హజారే వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు