ఢిల్లీ మైనారిటీస్‌ కమిషన్‌ చైర్మన్‌పై దేశద్రోహం కేసు

2 May, 2020 10:33 IST|Sakshi
జఫారుల్ ఇస్లాం ఖాన్, ఢిల్లీ మైనారిటీస్‌ కమిషన్‌ చైర్మన్‌

ఢిల్లీ : ఢిల్లీ మైనారిటీస్‌ కమిషన్‌ చైర్మన్‌ జఫారుల్ ఇస్లాం ఖాన్‌పై గురువారం దేశదేహ్రం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ విభాగం పేర్కొంది. రెండురోజుల క్రితం​ జఫారుల్ ఇస్లాం సోషల్‌ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై సెక్షన్‌ 124 ఏ( దేశద్రోహం), సెక్షన్‌ 153 ఏ( జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద కేసులు నమోదు చేసినట్లు జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ ఠాకూర్‌ తెలిపారు. వసంత్‌ కంజ్‌ ప్రాంతానికి చెందిన నివాసితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. ఏప్రిల్‌ 28న  సోషల్‌ మీడియా వేదికగా (ట్విటర్‌, ఫేస్‌బుక్‌) మతాలను రెచ్చగొట్టేలా జఫారుల్‌ వ్యాఖ్యలు ఉన్నాయని, మ‌త సామ‌ర‌స్యానికి విఘాతం క‌లిగించేలా, సమాజంలో చీలికను తెచ్చేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా ఖాన్ ఆరోపించిన మత వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దేశాన్నిమోసం చేసి పారిపోయిన నేరస్థుడి పేరు ఖాన్ తన వ్యాఖ్యల్లో‌ ప్రస్తావించారు. భారత అధికారుల అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ ఇప్పటికే ఆ నేరస్థుడి మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. అంతేగాక అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ), మనీలాండరింగ్, టెర్రర్ సంబంధిత కేసుల కింద బుక్ చేసింది. అలాంటి వ్యక్తిని జఫారుల్‌ ప్రశంసించడం దేశద్రోహం కిందే లెక్కగడతారని ఫిర్యాదులో ఉంది. అయితే దీనిపై జఫారుల్‌ స్పందిస్తూ... తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందన్న వార్తలు అవాస్తవమన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని తన దృష్టికి వచ్చేంతవరకు ఈ విషయాన్ని నమ్మనన్నారు. అయితే గురువారం ట్విటర్‌ వేదికగా నెటిజన్లను క్షమాపణలు కోరారు. ' నేను చేసిన ట్వీట్‌ కొంతమందికి బాధ కలిగించింది. కానీ తన వ్యాఖ్యలతో ఏ ఒక్కరిని కించపరిచాలనే ఉద్దేశం నాకు లేదు. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి' అంటూ జఫారుల్‌ ఇస్లాం ఖాన్‌ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు