జేఎన్‌యూకు మైనారిటీ కమిషన్‌ నోటీసులు

22 May, 2018 19:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై కోర్సు ప్రారంభించాలనే ప్రతిపాదనకు సహేతుక కారణం వెల్లడించాలని కోరుతూ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రిజిస్ర్టార్‌కు ఢిల్లీ మైనారిటీ కమిషన్‌ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ప్రతిపాదిత కోర్సుపై వచ్చిన వార్తలపై సుమోటోగా మైనారిటీ కమిషన్‌ స్పందిస్తూ ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై ఏ ప్రాతిపదికన యూనివర్సిటీ కోర్సు ప్రారంభిస్తుందో వివరణ ఇవ్వాలని రిజిస్ర్టార్‌కు ఇచ్చిన నోటీసులో కమిషన్‌ పేర్కొంది. జేఎన్‌యూకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కమిషన్‌ ఛైర్మన్‌ జఫరుల్‌ ఇస్లాం ఖాన్‌ నిర్ధారించారు.

కాగా సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ సెక్యూరిటీ స్టడీస్‌ను ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణలో ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై కోర్సును ప్రారంభించాలని జేఎన్‌యూ అకడమిక్‌ కౌన్సిల్‌ ప్రతిపాదనను ఆమోదించింది. గత వారం వర్సిటీ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సమావేశానికి హాజరైన ఓ ప్రొఫెసర్‌ పేర్కొన్నారు. అయితే ఈ కౌన్సిల్‌ భేటీలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం కోర్సును చేర్చేందుకు ఏదైనా సిద్ధాంత పత్రం, నిర్థిష్ట ప్రతిపాదన ముందుకొస్తే వాటి నకలును సమర్పించాలని జేఎన్‌యూను మైనారిటీ కమిషన్‌ కోరింది. కోర్సుకు సంబంధించిన సమగ్ర వివరాలను, కౌన్సిల్‌ భేటీ అజెండాను, హాజరైన సభ్యుల వివరాలను తెలపాలని కోరింది.

మరిన్ని వార్తలు