దేశమంతటా ‘ఉగ్ర’ అలర్ట్

7 Mar, 2016 01:51 IST|Sakshi
దేశమంతటా ‘ఉగ్ర’ అలర్ట్

10 మంది ఉగ్రవాదులు చొరబడ్డట్లు హెచ్చరిక
* గుజరాత్‌కు బలగాలు
* భారత తీరంలో పాక్ బోటు

న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి 10మంది లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న సమాచారంతో దేశంలోని ముఖ్యప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా వివిధ దేవాలయాలపై దాడులు జరగొచ్చనే అనుమానంతో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, కాశీతోపాటు వివిధ శైవక్షేత్రాల వద్ద భద్రత పెంచారు.

అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంటలిజెన్స్ హెచ్చరికలతో.. గుజరాత్‌కు నాలుగు ఎన్‌ఎస్‌జీ టీమ్‌లను పంపగా.. అందులో ఒక టీమ్ పూర్తిగా సోమనాథ్ ఆలయ భద్రత చూసుకుంటుంది.
 
భారత్ తీరంలో పాక్ బోటు
పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ ఖాన్ జంజువా.. ఉగ్రవాదుల చొరబాటుపై భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌కు సమాచారం అందించటంతో గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దీనిపై గుజరాత్ ఐబీ చీఫ్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘కేంద్రీయ ఇంటలిజెన్స్‌నుంచి దీనిపై స్పష్టమైన హెచ్చరికలు అందాయి. భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలోని కోటేశ్వర్ ప్రాంతంలో.. ఓ పాకిస్తానీ బోటును బీఎస్‌ఎఫ్ జవాన్లు గుర్తించి దగ్గరకు వెళ్లేలోపే వారంతా పారిపోయారు. ఆ బోటులో అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు’ అని ప్రమోద్ కుమార్ తెలిపారు.
 
కోల్‌కతాలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును పేల్చేస్తామంటూ హెచ్చరిక రావటంతో ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేశారు.పాకిస్తాన్‌కు పంజాబ్ సరిహద్దులోని గుజరాత్ అనే గ్రామం నుంచి ఫోన్‌కాల్ వెళ్లినట్లు ఇంటిజెన్స్ అధికారులు చేసిన హెచ్చరికలతో.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ అప్రమత్తమైంది.

>
మరిన్ని వార్తలు