‘ఇన్‌స్టా’లో ‘బాయిస్‌’ బీభత్సం

7 May, 2020 03:14 IST|Sakshi

బాయిస్‌ లాకర్‌ రూమ్‌ పేరుతో గ్రూప్‌ ఏర్పాటు

బాలికల ఫొటోల అసభ్య మార్ఫింగ్, షేరింగ్‌

గ్రూప్‌ అడ్మిన్‌ అరెస్ట్

గ్రూప్‌లో అంతా విద్యార్థులే

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాయిస్‌ లాకర్‌ రూమ్‌’అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని బాలికల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, వారిపై అసభ్యంగా కామెంట్స్‌ చేస్తున్న మైనర్‌ విద్యార్థులపై ఢిల్లీ పోలీస్‌కు చెందిన సైబర్‌ క్రైమ్‌ విభాగం చర్యలు తీసుకుంది. ఆ గ్రూప్‌ అడ్మిన్‌ను బుధవారం అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి గ్రూప్‌లోని ఇతర విద్యార్థుల సమాచారం సేకరించింది. ఢిల్లీలోని 3 ప్రముఖ పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించింది.

బాలికల ఫొటోలను నగ్న ఫొటోలుగా మార్ఫ్‌ చేయడం, వాటిని ఆ గ్రూప్‌ చాట్‌ రూమ్‌లో షేర్‌ చేసుకుంటూ అసభ్యంగా, గ్యాంగ్‌ రేప్‌ చేయాలంటూ నేరపూరితంగా సందేశాలు పంపుకునేవారు. ఆ డిస్కషన్స్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ ఇతర మాధ్యమాల్లో వైరల్‌ అయ్యి, సంచలనం సృష్టించడంతో సైబర్‌ క్రైమ్‌ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఒక బాలిక ఈ గ్రూప్‌ సంభాషణల స్క్రీన్‌ షాట్స్‌ను బహిర్గతపర్చడంతో మొదట ఈ గ్రూప్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చదవండి: అమెరికాలో లాక్‌డౌన్‌ ఎత్తివేత ఫలితం? 

గ్రూప్‌లో 13–18 ఏళ్లలోపువారు..
నోయిడాలోని ఒక ప్రముఖ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసుకున్న 18 ఏళ్ల విద్యార్థి ఆ గ్రూప్‌ అడ్మిన్‌గా గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 27 మంది గ్రూప్‌ సభ్యులను పోలీసులు గుర్తించారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిలో చాలామంది 11, 12 తరగతుల వారే. గ్రూప్‌లో 13 ఏళ్ల విద్యార్థి నుంచి 18 ఏళ్ల వయస్సున్న విద్యార్థి వరకు ఉన్నారు. ఆ గ్రూప్‌లోని మైనర్‌ సభ్యులను పోలీసులు వారి తల్లిదండ్రులు, ఎన్జీఓ ప్రతినిధుల ముందు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 51 మంది సభ్యులున్నారని, మార్చి నెలాఖరులో తమను చేర్చుకున్నారని పలువురు విద్యార్థులు తెలిపారు.

బాలికలు తమ ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్‌ చేసుకున్న ఫొటోలను వీరు అసభ్యంగా మార్ఫ్‌ చేసి బాయిస్‌ లాకర్‌ రూమ్‌ గ్రూప్‌లో షేర్‌ చేసేవారు. ఈ గ్రూప్‌ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కోరామని, వారి నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు. జువనైల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం మైనర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు, ఇన్‌స్టాగ్రామ్‌కు ఢిల్లీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. కేసును సుమోటాగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు బుధవారం ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌కు లేఖ రాశారు. పోక్సో, ఐటీ చట్టాలు, ఐపీసీ కింద వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. చదవండి: డర్టీ ఛాట్

మరిన్ని వార్తలు