ఫలించిన స్టింగ్‌ ఆపరేషన్‌.. విచారణకు ఆదేశం!

12 Jan, 2020 16:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో జరిగిన హింసాపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వర్సిటీ పరిధిలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీవీపీకి చెందిన విద్యార్థులే ఈనెల 5న జరిగిన దాడిలో పాల్గొనట్టు వెల్లడయిన విషయం తెలిసిందే. అక్షత్‌ ఆవాస్థీ అనే ఏబీవీపీకి చెందిన విద్యార్థి మాట్లాడుతూ.. ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు నాయకత్వం వహించింది తానేనని వీడియా ముందు ఒప్పుకున్నాడు. అంతేకాందు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై ప్రతీకారం తీర్చుకునేందుకు హాస్టల్‌ బయట నుంచి కొంతమంది వ్యక్తులను లోపలికి తీసుకెళ్లి ఈ దాడికి పాల్పడ్డటు కూడా అంగీకరిస్తాడు. ఆయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కేసు విచారణ నిమిత్తం అక్షత్‌ను వెంటనే తమ ముందు విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. ఆయనతో పాటు ఆ రోజు ఘటనలో పాల్గొన్న మరో 37 మందిని అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. (మిస్టరీగా మిగిలిన ముసుగు దుండుగులు..!)

మరోవైపు అక్షత్‌తో తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని ఏబీవీపీ ఇది వరకే ప్రకటించింది. అయితే పోలీసుల విచారణ ఏ మేరకు నిజాలను రాబడుతోందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఢిల్లీ పోలీసులు ఇదివరకే బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయిషీ ఘోష్‌ కూడా ఆ జాబితాలో ఉన్నారు. దీంతో పోలీసుల విచారణ తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామే తప్పుచేయలేదని, పోలీసులు కుట్రపూరింతంగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. (ఎవరీ ఆయిషీ ఘోష్‌?)

మరిన్ని వార్తలు