అద్దె చెల్లించ‌మ‌ని ఒత్తిడి..య‌జ‌మానుల‌పై కేసు న‌మోదు

16 May, 2020 13:39 IST|Sakshi

ఢిల్లీ : అద్దె క‌ట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన తొమ్మిది మంది ఇంటి య‌జ‌మానుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుతున్న విద్యార్థులు కాలేజీకి ద‌గ్గ‌ర్లో ఉన్న ఇళ్ల‌లో పేయింగ్ గెస్టులుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అద్దె క‌ట్టాలంటూ విద్యార్థుల‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో తొమ్మిది మంది ఇంటి య‌జ‌మానుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద ఇంటి యజ‌మానుల‌పై కేసు న‌మోదైంది. దీని ప్ర‌కారం వారికి ఒక నెల జైలు శిక్ష, జ‌రిమానా లేదా రెండూ విధించే అవ‌కాశం ఉంది. ఇక ద‌క్షిణ ఢిల్లీ ప్రాంతం కోట్ల ముబారక్‌పూర్‌లో అద్దె చెల్లించ‌ని కార‌ణంగా విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను తీసేశారు ఇంటి య‌జ‌మాని. దీంతో పోలీసుల‌ను బాధితుడు ఆశ్ర‌యించగా..ఇరు వ‌ర్గాల మ‌ధ్య ప‌రిష్కారం కుదర‌డంతో ఫిర్యాదును వెన‌క్కి తీసుకున్నాడు.

వ‌లస కార్మికుల నుంచి ఒక నెల అద్దె వ‌సూలు చేయ‌వ‌ద్ద‌ని ఇంటి య‌జ‌మానుల‌ను పోలీసులు ఒప్పించారు. అదే విధంగా విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ అద్దె వ‌సూలు చెల్లించ‌మ‌ని ఒత్తిడి చేయ‌కుండా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని పోలీసు సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న కార‌ణంగా ఇంటి అద్దెలు చెల్లించాలంటూ య‌జ‌మానులు ఒత్తిడి చేయ‌రాదంటూ ప్ర‌భుత్వం విఙ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. (కరోనా ఎఫెక్ట్‌ : ఇంటి కిరాయి మూడు నెలలు వాయిదా )


క‌రోనా కార‌ణంగా అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో కిరాయిలు క‌ట్ట‌డం అంటే చాలా క‌ష్ట‌త‌ర‌మైన విష‌య‌మ‌ని, దీంతో మూడు నెల‌ల‌పాటు అద్దె వాయిదా వేసుకోవాలంటూ ప్ర‌భుత్వం పేర్కొంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎవ‌రైనా ఒత్తిడి చేసినా, ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపినా హెల్ప్ లైన్ నెంబ‌ర్ల‌కు కాల్ చేయాల్సిందిగా సూచించింది. త‌ద‌ణుగుణంగా ఇంటి య‌జ‌మానుల‌పై జ‌రిమానా విధించ‌డంతో పాటు జైలు శిక్ష‌ను విధిస్తామ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. (మూడు నెలలపాటు అద్దె వసూలు వాయిదా )

మరిన్ని వార్తలు