కేజ్రీవాల్‌ ఇంట్లో సోదాలు

24 Feb, 2018 01:58 IST|Sakshi
ఆధారాలు తీసుకెళ్తున్న పోలీసులు

సీసీటీవీ ఫుటేజ్, హార్డ్‌డిస్క్‌ పోలీసుల స్వాధీనం

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)పై ఆప్‌ ఎమ్మెల్యేల దాడి కేసులో ఆధారాలను సేకరించేందుకు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ ఉన్న హార్డ్‌ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సీఎం ఇంట్లో సీఎస్‌పై దాడి జరిగినట్లుగా చెబుతున్న గదిలో సీసీటీవీ కెమెరా లేదు. సోదాలకు వస్తున్నట్లు సీఎం ఇంట్లోని సంబంధిత వ్యక్తికి ముందుగానే సమాచారమిచ్చామన్నారు. కేజ్రీవాల్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ కూడా సంకేతాలిచ్చారు.  

పోలీసులు రౌడీల్లా వ్యవహరించారు..
ఢిల్లీ పోలీసులు కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారారనీ, సీఎం నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి రౌడీల్లా వ్యవహరించారని ఆప్‌ ఆరోపించింది. సీఎంను అవమానించడానికే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారంది. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదేశం లేకుంటే పోలీసులు అలాంటి దాదాగిరి చేసి ఉండేవారు కాదని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. కేజ్రీవాల్‌ ఓ ట్వీట్‌ చేస్తూ ‘పెద్ద పోలీసు బలగాన్ని మా ఇంటికి పంపారు. 

మరి న్యాయమూర్తి లోయా మృతి కేసులో అమిత్‌ షాను ఎప్పుడు ప్రశ్నిస్తారు?’ అని అన్నారు. ఆప్‌ ప్రభుత్వంతో కలసి పనిచేసేలా ఉద్యోగులను ఆదేశించాల్సిందిగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను కేజ్రీవాల్‌ కోరారు. కాగా, అరెస్టైన ఎమ్మెల్యేల బెయిల్‌ అభ్యర్థనలను స్థానిక కోర్టు కొట్టివేసింది. కాగా, ప్రజోపయోగ పనులకు అడ్డొచ్చే అధికారులను కొట్టాల్సిందేనని ఉత్తమ్‌ నగర్‌ ఎమ్మెల్యే నరేశ్‌ బాల్యన్‌ వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు