లాక్‌డౌన్‌ : పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు

24 Apr, 2020 11:36 IST|Sakshi

ఢిల్లీ : కరోనా మ‌హ‌మ్మారిని తరిమికొట్టడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కొన్ని కుటుంబాలకు తీరని వ్యధను మిగిలిస్తోంది. తమవారు చనిపోతే కడసారి చూసుకునే అవకాశం కూడా లేకపోవడం కలిచివేస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుండడంతో అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోతున్నారు. తన భర్త చనిపోతే అంత్యక్రియలు కూడా నిర్వహించడాని​కి వీలు లేకపోవడంతో పోలీసులతోనే ఆ కార్యక్రమాన్ని జరిపించాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
(కరోనా : వారి అనుమానం అతని ప్రాణం తీసింది)

వివరాలు.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌కు చెందిన వ్యక్తి ఏప్రిల్‌ 13న చికెన్‌పాక్స్‌తో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా గోర‌ఖ్‌పూర్‌లోని అత‌ని కుటుంబ‌స‌భ్యులు ఢిల్లీకి వ‌చ్చే అవకాశం లేదు. దీంతో మృతదేహం 10 రోజులుగా మార్చురీలోనే ఉండిపోయింది. అయితే మృతుడి భార్య తన భర్త మృతదేహాన్ని గోరక్‌పూర్‌కు పంపించడం వీలు కాకపోతే అంత్యక్రియలు అక్కడే చేయండి అంటూ ఢిల్లీ పోలీసులకు లేఖ ద్వారా తెలిపారు. అయితే తన భర్త మరణ దృవీకరణ పత్రంతో పటు పోస్టుమార్టం రిపోర్టును పంపించాలంటూ లేఖలో పేర్కొంది. ఒక కుటుంబం పడుతున్న ఆవేదనను చూసిన ఢిల్లీ పోలీసులు గురువారం ఆ వ్యక్తి​కి హిందూ సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించారు. (ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా?)

ఇదే విషయమై డీసీపీ విజయంత ఆర్య మాట్లాడుతూ..' ఇది చాలా బాధాకరమైన విషయం. తన భర్త అంత్యక్రియలు నిర్వహించాలని ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖ నేను చూశాను. లాక్‌డౌన్‌ ఉండడంతో  తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులే అంత్యక్రియలు జరిపించారు. అయితే ఆమె లేఖలో పేర్కొన్న విధంగా మృతుడి మరణ దృవీకరణ పత్రంతో పాటు పోస్టుమార్టం రిపోర్టును పోస్ట్‌ ద్వారా ఆమెకు అందజేస్తామని'  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు