ఆప్ కార్యకర్తలు రెచ్చగొట్టడంతో ఉరేసుకున్నాడు

30 Apr, 2015 02:08 IST|Sakshi

గజేంద్ర ఆత్మహత్యపై ఢిల్లీ పోలీసుల నివేదిక
న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) ఈ నెల 22న ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టడం వల్లే రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ చెట్టుకు ఉరేసుకున్నాడని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై తమ నివేదికతోపాటు, గజేంద్ర పోస్ట్ మార్టం నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించారు. ‘చెట్టెక్కిన గజేంద్రను ఆప్ కార్యకర్తలు చప్పట్లు, నినాదాలతో రెచ్చగొట్టారు. అలా చేయొద్దని మేం చాలాసార్లు కోరినా వారు పట్టించుకోలేదు.

సభలో ఆప్ నేతలు చేసిన ప్రసంగాలూ ఆ రైతును రెచ్చగొట్టాయి’ అని తమ నివేదికలో తెలిపారు. గజేంద్రను ఆప్ కార్యకర్తలు రెచ్చగొట్టారని ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కాగా, పోస్ట్ మార్టంను జాప్యం చేయడానికి ఢిల్లీలోని ఆప్ సర్కారు ప్రయత్నించిందని పోలీసులు ఆరోపించారు. పోస్ట్ మార్టంను వెంటనే జరపొద్దని చాణక్యపురి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్‌డీఎం) అడ్డుకున్నారని తెలిపారు. అయితే ఆయన అధికారిక ఉత్తర్వు చూపకపోవడంతో తాము పోస్ట్ మార్టం జరిపించామన్నారు. ఈ ఆరోపణలను ఎస్‌డీఎం ఖండించారు. చెట్టుకు ఉరేసుకోవడం వల్లే గజేంద్ర చనిపోయాడని వైద్యులు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. చెట్టుపై నుంచి కిందపడడం వల్ల గాయాలైనట్లు కానీ, ఎముకలు విరిగినట్లు కానీ కనిపించడం లేదన్నారు.

>
మరిన్ని వార్తలు