ఉమర్‌ ఖలీద్‌పై దాడి : ఆ నెంబర్‌ ఆధారంగా..

16 Aug, 2018 09:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించడంలో విఫలమైన ఢిల్లీ పోలీసులు తాజాగా కీలక ఆధారాలు రాబట్టారు. గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవాని, జేఎన్‌యూ విద్యార్థి షెహ్లా రషీద్‌లకు బెదిరింపు మెసేజ్‌లు పంపేందుకు వాడిన మొబైల్‌ నెంబర్‌ కొన్ని క్లూలను ఇస్తుందని భావిస్తున్నారు. ఈ నెంబర్‌ విదేశాల్లో నమోదైందా అనే కోణంలో విచారిస్తున్నామని ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ వర్గాలు తెలిపాయి. ఈ నెంబర్‌ ఏ దేశానికి చెందినదో వెల్లడైతే యూజర్‌ వివరాలను తెలుసుకోవచ్చని చెబుతున్నాయి.

గ్యాంగ్‌ స్టర్‌ రవిపూజారిగా చెబుతున్న వ్యక్తి నుంచి జూన్‌, ఆగస్ట్‌ల్లో మెవాని, రషీద్‌లకు బెదిరింపు మెసేజ్‌లు వెళ్లాయి. ఖలీద్‌కు హాని తలపెడతానని కూడా మెసేజ్‌ పంపిన వ్యక్తి మెవానిని హెచ్చరించినట్టు సమాచారం. కాగా, తనకు భద్రత కల్పించే విషయంతో పాటు దాడి కేసుకు సంబంధించి గురువారం తనను ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ అధికారులు పిలిచారని, భద్రత కల్పించాలని కోరుతూ తాను మరో దరఖాస్తు సమర్పిస్తానని ఉమర్‌ ఖలీద్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు