ఢిల్లీ ఆసుప‌త్రుల్లో 'ఇత‌రుల‌కు' నో ఛాన్స్‌!

7 Jun, 2020 15:03 IST|Sakshi

90 శాతం స్థానికుల‌కే ప‌డ‌క‌లు

తెరుచుకోనున్న స‌రిహ‌ద్దులు

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌తిరోజు వెయ్యికి పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే పెరుగుతున్న కేసుల‌కు అనుగుణంగా ఢిల్లీవాసుల‌కు స‌రిప‌డా సంఖ్య‌లో బెడ్లు కూడా అందుబాటులో లేని ప‌రిస్థితి దాపురించింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్న ఆసుప‌త్రుల‌తో పాటు కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనూ స్థానికులకు మాత్ర‌మే చికిత్స అందించాల‌ని తెలిపారు. ఇందుకోసం 10వేల ప‌డ‌క‌లు కేటాయించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు ఎప్ప‌టిలాగే అంద‌రికీ చికిత్స అందిస్తాయని పేర్కొన్నారు. ప‌డ‌క‌లు అందుబాటులో లేని కార‌ణంగా అనేక మంది ప్ర‌జ‌లు వెనుదిరిగి వెళ్లిపోతున్నార‌న్న విష‌యం ప్ర‌భుత్వ దృష్టికి వ‌చ్చింది. (కరోనా పేషంట్లకు మంచాలు లేవు.. స్పందించిన మంత్రి)

దీంతో క‌రోనా సంక్షోభం ముగిసేవ‌ర‌కు 90 శాతం ప‌డ‌క‌లు స్థానికుల‌కే కేటాయించాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. కాగా ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ఢిల్లీలో 15 వేల బెడ్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అంచ‌నా. మ‌రోవైపు ల‌క్ష‌ణాలు లేనివారికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తూ అడ్మిట్ చేసుకుంటున్న ప్రైవేటు ఆసుప‌త్రుల‌పై ప్ర‌భుత్వం మండిప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిస్థితిని బ్లాక్ మార్కెటింగ్ చేసుకునేవారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. ఇదిలా వుంటే సోమ‌వారం నుంచి రాష్ట్ర స‌రిహ‌ద్దులు తెరుచుకోనున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి రాక‌పోక‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్ర‌స్తుతం ఢిల్లీలో 27 వేల కేసులు న‌మోద‌య్యాయి. (బ్లాక్‌ మార్కెటింగ్‌ విషయలో కఠినంగా ఉంటాం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు