రోడ్లు యమపురికి రహదారులు!

24 Jun, 2014 22:58 IST|Sakshi
రోడ్లు యమపురికి రహదారులు!
న్యూఢిల్లీ: రాజధాని నగర రోడ్లు పౌరుల పాలిట యమపురికి రహదారులుగా మారిపోతున్నాయి. ద్విచక్రవాహనాలపై ప్రయాణం సైతం ప్రాణాలకు భద్రత కల్పించలేకపోతోంది. ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరిగే నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర శాస్త్ర, పర్యావరణ విభాగం (సీఎస్‌ఈ)  నివేదిక వెల్లడించింది.  రోడ్డు ప్రమాదాల కారణంగా నగరంలో ప్రతిరోజూ సగటున 4.31 శాతం మరణా లు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి 151 రోజుల్లో 651 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందారు. 
 
 రాత్రి సమయంలో 325, పగలు 332 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో పాదచారులే అత్యధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.  కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించిన భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2012 నివేదికను సీఎస్‌ఈ ఉటంకించింది. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిరోజూ ఐదుగురు మృతి చెందుతున్నారని, వీరిలో ఇద్దరు పాదచారులు, ఇద్దరు ద్విచక్రవాహనదారులు ఉంటున్నారని సీఎస్‌ఈ తెలిపింది. ప్రతివారం ఇద్దరు సైకిలిస్టులు, ఒక కారు ప్రయాణికుడు మృత్యువాత పడుతున్నారని పేర్కొంది. 
 
 ఇక రాజధాని నగరంలో నిబంధనల ఉల్లంఘనకు హద్దే లేదని సీఎస్‌ఈ తెలిపింది. సిగ్నల్ జంపింగ్ కేసులు 3.29 లక్షలు, డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు 14 వేలు, పరిమితిని మించిన వేగం కేసులు 45,158 నమోదయ్యాయని పేర్కొంది. ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరిగే నగరాల్లో చెన్నై రెండో స్థానంలో నిలిచింది. వాహనాలు ఢీకొని మృతి చెందే పాదచారుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 44 శాతం ఉన్నట్లు సీఎస్‌ఈ నివేదిక తెలిపింది. యాభై శాతం రోడ్డు ప్రమాదాలు రాత్రి పూటే జరుగుతున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా సాయంత్రం 6.00 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య 33 శాతం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. ‘‘ప్రాణాంతక రోడ్లు సృష్టిస్తున్న ఈ మారణహోమానికి ధనికులు, శక్తిమంతులు, పేదలు అన్న తేడాలేకుండా అందరూ బలవుతున్నారు’’ అని సీఎస్‌ఈ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుమిత రాయ్ చౌదరి వ్యాఖ్యానించారు. 
 
 రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ఫ్లై ఓవర్లు, హైస్పీడ్ కారిడార్లు, క్రాసింగ్‌ల వద్ద చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఫ్లైఓవర్ల వద్ద ప్రమాదాలు జరిగే ప్రాం తాలను గుర్తించామని వీటిలో 27 శాతం రింగ్‌రోడ్డుపై, 17 శాతం జీటీ కే రోడ్డుపై, 13 శాతం ఔటర్ రింగు రోడ్డుపై, ఆరు శాతం మథురా రోడ్డు ఉన్నాయని ఆమె చెప్పారు. కనీసం 75 శాతం మరణాలు నగరంలోని హైస్పీడ్ కారిడార్లుగా ఉన్న ఎనిమిది ప్రధాన రహదారులపై నమోదవుతున్నాయని అనుమిత పేర్కొన్నారు. ఈ రహదారులపై ఫ్లై ఓవర్లు, పాదచారుల వంతెనలు, భూగర్భ మార్గాలు ఉన్నప్పటికీ ఈ రహదారులు మృత్యుకుహరంగా మారుతున్నాయని ఆమె వాపోయారు.
 
 ప్రమాదాల్లో అత్యధిక భాగం బస్‌స్టాండ్లు, మెట్రో స్టేషన్ల వద్ద జరగడం విచిత్రంగా ఉందని సీఎస్‌ఈ డెరైక్టర్ జనరల్ సునీతా నారాయణ్ పేర్కొన్నారు. ఐఎస్‌బీటీ గేట్, ఆనంద్ విహార్ ఐఎస్‌బీటీ, పశ్చిమ్ విహార్ మెట్రో స్టేషన్, ఉత్తమ్‌నగర్ మెట్రో స్టేషన్, జహంగీర్‌పురీ బస్టాండ్ ప్రాంతాలు ప్రమాదాలకు నెలవులని అన్నారు. ప్రమాద స్థలాలుగా కశ్మీరీగేట్, వజీర్‌పూర్ సహా పది బస్టాప్‌లను గుర్తించామని, వీటి సమీపంలోనే 8 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. మెట్రోస్టేషన్లలో మానసరోవర్ పార్క్, ఉత్తమ్‌నగర్, మాదీపూర్ పార్కులు ప్రధాన ప్రమాద స్థలాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించకోకపోవడం, బస్టాప్‌లను అత్యధికంగా ఫుట్‌పాత్‌లపై నిర్మించడం వల్లనే ప్రమాదాల్లో మృతుల సంఖ్య అధికం గా ఉంటోందని, ఈ విధానం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
 
>
మరిన్ని వార్తలు