వైరల్‌ ఫోటో.. భారీ విరాళం.. చివరకు వివాదం

22 Sep, 2018 12:28 IST|Sakshi
వైరల్‌గా మారిన ఫోటో అనిల్‌ మృతదేహం వద్ద విలపిస్తోన్న బాలుడు

న్యూఢిల్లీ : కొన్ని రోజుల క్రితం ఢిల్లీ నగరంలో విధులు నిర్వహిస్తూ అనిల్‌(37) అనే పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు. వీరి కుటుంబాన్ని ఆదుకోవడానికి కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో అనిల్‌ మృతదేహం వద్ద విలపిస్తోన్న ఓ బాలుడి ఫోటోను ఈ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం కోసం వాడారు. హృదయవిదారకంగా ఉన్న ఈ ఫోటో నెటిజన్లను కదిలించిండంతో విరాళాలు భారీగా వచ్చాయి. ఈ ఒక్క ఫోటో వల్ల దాదాపు 60 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయంటే ఈ ఫోటో ఎంత వైరల్‌గా మారిందో అర్ధం చేసుకోవచ్చు. విరాళాల ద్వారా వచ్చిన సొమ్మును సదరు బాలుడి కుటుంబానికి అందించే సమయానికి అసలు కథ ప్రారంభమయ్యింది.

అప్పటి దాకా అనిల్‌ మృతదేహం పక్కన విలపిస్తున్న బాలున్ని అందరూ అతని కుమారుడిగానే భావించారు. పాపం చిన్న వయసులోనే తండ్రిని పొగొట్టుకున్నాడని జాలీ పడటంతో భారీగా విరాళాలు ఇచ్చారు. చివర్లో ఆ సొమ్మును ఆ బాలుని కుటుంబానికి ఇచ్చే సమయంలో అనూహ్యంగా అనిల్‌ సోదరి రంగంలోకి వచ్చారు. ఫోటోలో అనిల్‌ పక్కన ఏడుస్తున్న బాలుడికి, తన సోదరునికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అంతేకాక అసలు తన సోదరునికి వివాహమే కాలేదని తెలిపారు. అంతేకాక బాలునికి, అనిల్‌కి ఉన్న సంబంధం గురించి అనిల్‌ సోదరి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఫోటోలో ఉన్న బాలుడి తల్లి పేరు రాణి. ఆమె, అనిల్‌ ఇద్దరూ మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రాణికి ఫోటోలో చూపిన బాలుడే కాక మరో ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాణి భర్త ముంబైలో ఉంటున్నాడన్నారు. అప్పటి నుంచి అనిల్‌ రాణి కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిపారు.

ఫోటోలో ఉన్న బాలుడు అనిల్‌ కుమారుడు కాదని తెలియడంతో విరాళాలు సేకరిస్తున్న వ్యక్తులు ఇరకాటంలో పడ్డారు. అసలు ఇంత భారీ విరాళం రావడానికి ముఖ్య కారణం ఫోటోలోని కుర్రాడు. దాంతో విరాళాలు సేకరించిన వ్యక్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. కొన్ని రోజుల క్రితమే సుప్రీం కోర్టు కూడా ఇద్దరు మేజర్లు కలసి జీవించవచ్చంటూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా విరాళాలు సేకరించిన వ్యక్తులు ఈ సోమ్మును సదరు బాలుడి పేరున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఈ విషయం గురించి వారు ‘ప్రస్తుతం రాణి, ఆమె పిల్లలు అనిల్‌ మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి దాని మీద వచ్చే వడ్డీని ఆ పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం, చదువు కోసం వినియోగించే ఏర్పాట్లు చేశా’మని తెలిపారు. 

మరిన్ని వార్తలు