లాక్‌డౌన్‌ : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

17 Apr, 2020 16:23 IST|Sakshi

పాఠశాల ఫీజులు పెంచితే కఠిన చర్యలు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూతపడి విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఈ సమయంలో ఫీజులను పెంచవద్దని ఆదేశించింది. ఢిల్లీలోని ప్రైవేటు పాఠశాలలన్నీ ప్రభుత్వం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, ఫీజులు కట్టేలా విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావద్దని హెచ్చరించింది. అలాగే త్రైమాసికంలో కాకుండా నెల వారిగా మాత్రమే ఫీజులు లెక్కించేలా ప్రైవేటే పాఠశాలలు విధానాలు మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియా శుక్రవారం మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.

అలాగే లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థుల ట్రాన్స్‌పోర్ట్‌ కూడా నిలిచిపోవడంతో ఆయా ఫీజులను యాజమాన్యాలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సిసోడియా హెచ్చరించారు. కాగా లాక్‌డౌన్‌ సమయంలో పిల్లల ఫీజులు కట్టమని పలు విద్యాసంస్థలు ఒత్తిడి తెస్తున్నాయంటూ కొందరు ఢిల్లీ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు, మంత్రులతో సమావేశమైన కేజ్రీవాల్‌ ఫీజులు వసూలు చేయకుండా ఉండేలా ప్రైవేటు పాఠశాలలకు పలు మార్గదర్శకాలు తయారు చేయించారు.

మరిన్ని వార్తలు