వైద్యుడిని కొట్టి చంపేశారు

25 Mar, 2016 14:35 IST|Sakshi
వైద్యుడిని కొట్టి చంపేశారు

న్యూఢిల్లీ: స్వల్పవివాదానికే కొంతమంది వ్యక్తులు వైద్యుడిని కొట్టిచంపిన వైనం కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన దంతవైద్యుడు డాక్టర్ పంకజ్ నారంగ్ (40) పై దాడిచేసిన కొంతమంది వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఇద్దరు బాల నేరస్తులు కూడా ఉన్నారు. దక్షిణ ఢిల్లీలోని వికాసపురి కాలనీలో గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  భారత్ బంగ్లా టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ తరువాత, నారంగ్ కుమారుడు  బుధవారం రాత్రి ఇంటి బాల్కనీ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు  బంతి అటుగా వెళుతున్న నిందితులకు తగిలింది.  అంతే వివాదం రాజుకుంది.   అప్పటికి  సద్దు మణిగిన వారు బైకు అక్కడే  వదిలేసి పారిపోయారు. అనంతరం అర్థరాత్రి దాటిన తర్వాత దాదాపు 12 మందితో కలిసి కర్రలు, రాడ్లతో వైద్యుని ఇంటిపై దాడికి దిగారు. అడ్డొచ్చిన వారిని సైతం  నెట్టివేసి, వైద్యుడిని బయటికి లాక్కొచ్చి  విచక్షణరహితంగా కొట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు చికిత్స నిమిత్తం వైద్యుడిని ఆసుపత్రికి తరలించినా, తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచాడు.  డాక్టర్ నారంగ్‌కు భార్య, కొడుకు ఉన్నారు.


ఈ కేసులో ప్రధాన నిందితుడు నజీర్ సహా అనుమానితులుగా నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు బాలనేరస్థులను  గుర్తించారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి పుష్పేంద్రకుమార్  తెలిపారు. కేసు నమోదుచేశామని విచారణ కొనసాగుతుందన్నారు.

మరిన్ని వార్తలు