కాకరకాయ, బెండకాయ టపాసులు కాల్చాలా?

7 Nov, 2018 16:36 IST|Sakshi
కాకరకాయ, బెండకాయ టపాసులంటూ నిరసనలు

కూరగాయలను టపాసులుగా మార్చి ఢిల్లీ వ్యాపారుల వినూత్న నిరసన

సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి రోజున కేవలం రెండు గంటలపాటు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల  వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. భారీ శబ్దాలు చేసే టపాసుల అమ్మకాలపై నిషేధం విధించింది. ఆన్‌లైన్‌ అమ్మకాలు చేపట్టొద్దని తేల్చి చెప్పింది. అవసరమనుకుంటే పర్యావరణహిత (ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించని) టపాకాయల్ని కాల్చుకోండని సూచించింది. (దీపావళి సంబరాలు.. కేసులే కేసులు)

కాగా, సుప్రీం ఆదేశాలపై దేశవ్యాప్తంగా సోషల్‌మీడియాలో ఇప్పటికే జోకులు పేలుతున్నాయి. రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టు తీర్పులు వచ్చాకే పండగ ఏర్పాట్లు చేసుకోవాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీలో బాణాసంచా అమ్మకాలకు కేంద్రమైన సదర్‌ బజార్‌ వ్యాపారులు సైతం సుప్రీం ఆంక్షలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని వారు వాపోయారు. అసలు పర్యావరణహిత టసాసులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.

కాకరకాయ, బెండకాయ, క్యాప్సికం వంటి కూరగాయలను టపాసులుగా మార్చి ఢిల్లీ వీధుల్లో వినూత్న నిరసనలకు దిగారు. గ్రీన్‌ టపాసులంటే ఇవేనా అంటూ వ్యాఖ్యానించారు. సదర్‌ బజార్‌ వ్యాపారుల సంఘం ప్రెసిడెంట్‌ చభ్రా మాట్లాడుతూ.. గ్రీన్‌ క్రాకర్స్‌ తయారు చేశామని కొన్ని ప్రభుత్వ ఏజన్సీలు తెలిపాయి. మేం వాటిని కొనుగోలు చేద్దామని వారిని సంప్రదిస్తే.. గ్రీన్‌ క్రాకర్స్‌ తయారీకి ఇంకో రెండు రోజులు పడుతుందని అంటున్నారు. రెండు రోజులు కాదు.. అలాంటివి మన దేశంలో ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. వాటిని తయారు చేయాలంటే కనీసం ఏడాది కాలం పండుతుండొచ్చని అన్నారు. ఇదిలాఉండగా కోర్టు ఆంక్షలకు విరుద్ధంగా నడుచుకుని బాణాసంచా కాల్చిన వారిపై  చట్టపరమైన కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు పోలీసుశాఖకు ఆదేశాలిచ్చింది.

మరిన్ని వార్తలు