స్పీడ్‌ లిమిట్‌లోనే ఉన్నా... భారీగా చలాన్లు..!

15 Oct, 2019 19:17 IST|Sakshi

ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసుల నిర్వాకం

విమర్శల నేపథ్యంలో చలాన్లు విత్‌డ్రా చేసేందుకు నిర్ణయం

న్యూఢిల్లీ : అనుమతించిన స్పీడ్‌లోనే వాహనాలు ప్రయాణించినప్పటికీ ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు భారీగా చలాన్లు విధించారు. వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విమ​ర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వేసిన చలాన్లను విత్‌డ్రా చేసేందుకు నిర్ణయించారు. వివరాలు.. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న 24వ జాతీయ రహదారిపై ఆగస్టు నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో దాదాపు ఒకటిన్నర లక్షల చలాన్లు విధించారు. వీటిలో అధిక భాగం ఓవర్‌స్పీడ్‌కు సంబంధించినవే. 

అయితే, ఉన్నఫళంగా చలాన్లు విత్‌డ్రా చేస్తామనడానికి కారణాలేంటనే ప్రశ్నకు ట్రాఫిక్‌ ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. జాతీయ రహదారులపై గంటకు 70 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించాలి. ఈ మేరకు ప్రజా పనుల విభాగం వేగం 70 దాటితే శిక్షార్హులు అనే బోర్డులు కూడా పెట్టాయి. అయితే, 24వ జాతీయ రహదారిపై నిజాముద్దీన్‌ బ్రిడ్జి, ఘాజీపూర్‌ మధ్య  60 కి.మీ వేగంతో వెళ్లిన వాహనాలకు సైతం చలాన్లు విధించారు.

దాంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే చలాన్లు వెనక్కు తీసుకుని ఉండొచ్చు’ అని అన్నారు. ఇదిలాఉండగా.. ఓవర్‌స్పీడ్‌ చలాన్లను ఇప్పటికే చాలామంది చెల్లించారని.. మరి ఆ సొమ్మునంతా వారికి తిరిగి ఇస్తారా అనే ప్రశ్నకు ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసుల నుంచి సమాధానం కరువైంది. అక్రమంగా ఫైన్లు వేయడంతో కోర్టుకు వెళ్తామన్న పలువురి హెచ్చరికల నేపథ్యంలోనే ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక విమర్శల నుంచి తప్పించుకోవడానకి 60 కి.మీ వేగం దాటితే శిక్షార్హులు అనే సూచిక బోర్డులు పెట్టాలని ట్రాఫిక్‌ అధికారులు ప్రజా పనుల విభాగాన్ని కోరడం గమనార్హం.

మరిన్ని వార్తలు