'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్‌లే!

2 Sep, 2019 20:54 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు విధించే జరిమానాలు అతి భారీగా ఉండడంతో తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలు మాత్రం పాత చలాన్‌లే విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌తో సహా ఈ జాబితాలో బీజేపీ పాలిత గుజరాత్‌ రాష్ట్రం కూడా చేరింది. అంతేకాక అనేక ఇతర రాష్ట్రాలు సవరించిన చట్టాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. 

భారీ జరిమానాలు విధించడం సాధ్యం కాదని, ఈ విషయమై ఆర్టీఓ, ట్రాఫిక్‌ పోలీసులతో చర్చలు జరిపి కొత్త జరిమానాలను నిర్ణయిస్తామని గుజరాత్ ప్రభుత్వ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సోమవారం పేర్కొన్నారు. అలానే మధ్యప్రదేశ్‌లో కొత్త చట్టం అమల్లోకి రాదని, జరిమానాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత చట్టం అమలు చేయబడుతుందని ఆ రాష్ట్ర న్యాయ వ్యవహారాల మంత్రి ప్రకటించిన విషయం విదితమే. ఢిల్లీలో కొత్త చట్టం అమలు చేస్తున్నప్పటికీ చలాన్‌ల విషయమై ట్రాఫిక్‌ పోలీసులతో చర్చలు జరిపే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది.

అయితే మోటారు వాహనాల సవరణ బిల్లు 2019ను పార్లమెంటు జూలైలో ఆమోదించింది. ఈ చట్టంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఉల్లంఘనులకు కఠినమైన జరిమానాలు విధించారు. కొత్త చట్టం ప్రకారం.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి జరిమానా రూ .100 నుంచి అమాంతం రూ .1,000లకు పెంచడం చర్చనీయాంశంగా మారిం‍ది.

కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మొదటి రోజు కేవలం 3,900 మందికి మాత్రమే చలాన్‌లు విధించారు. గత కొన్ని సంవత్సరాలుగా సాధారణంగా పండుగ రోజుల్లో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న వేళల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి సగటున కేవలం 6గంటల వ్యవధిలో సగటున 15,000 నుంచి 20,000 చలాన్లు విధించే ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ఆదివారం జారీ చేసిన చలాన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

అయితే సవరించిన చట్టం అమలులో మొదటి రోజు ఆదివారం కావడం, కొత్త చట్టం ప్రకారం జరిమానాలు చాలా భారీగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్త పడడం ఒకటైతే, జారీ చేసిన మొత్తం చలాన్లు ఆదివారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే తీసుకున్నవి అని ట్రాఫిక్ విభాగపు అధికారులు ధృవీకరించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా