కోటా కోసం 16,000 సీట్ల పెంపు

23 Jan, 2019 14:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కోటా అమలు కోసం ఢిల్లీ యూనివర్సిటీ కసరత్తు చేపట్టింది. ఈబీసీ కోటాను వర్తింపచేసేందుకు 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో అదనంగా 16,000 సీట్లను పెంచాలని ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు మొత్తం సీట్లలో 25 శాతం పెరుగుదల ఉండాలని కేంద్ర మానవ వనురుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

కాగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్లు 56,000 కాగా, పీజీ అడ్మిషన్ల కింద 9500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పది శాతం కోటాను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ధేశించడంతో ఆయా విద్యాసంస్ధలు మౌలిక వసతులను మెరుగుపరచకుండానే సీట్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

ఇక ఐఐటీ ఢిల్లీ, జేఎన్‌యూలు ఇప్పటికే తమ సీట్ల సంఖ్యను వరుసగా 590, 346 సీట్లకు పెంచాయి. ఈ విద్యా సంస్ధల్లో హాస్టల్‌ వసతి పరిమితంగా ఉండటంతో పెరిగే విద్యార్ధులకు వసతి కల్పించడంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్ధల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే జనరల్‌ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు