అం‍కిత్‌ శర్మ హత్య కేసు : ఆప్‌ నేతపై అనుమానాలు..!

27 Feb, 2020 13:05 IST|Sakshi
ఆప్‌ నేత తాహిర్‌ హుస్సేన్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన హత్యలో ఆమ్‌ఆద్మీ పార్టీ కౌన్సిలర్‌ తాహీర్‌ హుస్సేన్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో గత బుధవారం ఐబీ అధికార అంకిత్‌ శర్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అంకిత్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు.. మృతదేహాన్ని మురికి కాలువలో పడేసి వెళ్లారు. అయితే ఈ హత్యను తాహిర్‌, అతని మద్దతుదారులే చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చంద్ బాగ్ లోని ఆప్ నాయకుడు, మునిసిపల్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కు చెందిన భవనం నుండి కొంతమంది వ్యక్తులు రాళ్ళు రువ్వారని అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అంకిత్ దాడి చేశారని అంకిత్ తండ్రి రవీందర్ కుమార్ పేర్కొన్నారు.

(చదవండి : ఢిల్లీ అల్లర్లు : 35కు చేరిన మృతుల సంఖ్య)

అయితే ఈ ఆరోపణలను తాహిర్‌ తీవ్రంగా ఖండించారు. అంకిత్‌ మృతికి తనకు సంబంధం లేదన్నారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కమిల్‌ మిశ్రా విద్వేషపూరిత ప్రసంగాల వల్లే ఈ దాడులు మొదలయ్యాయని ఆరోపించారు. అల్లరు కూడా మొదటగా కపిల్‌ మిశ్రా ఇంటి సమీపంలోనే జరిగాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. హింసాకాండ సమయంలో తన ఇంట్లోకి ఓ గుంపు ప్రవేశించిందని, ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించగా ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. సమాచారం అందించిన 8 గంటల తర్వాత పోలీసులు వచ్చి తనను, తన కుటుంబీకులను రక్షించారని చెప్పారు. తన ఇంట్లోకి ప్రవేశించిన గుంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాహిర్‌ స్పష్టం చేశారు. కాగా, అక్కడ లభించిన వీడియోలో తాహీర్‌ చేతిలో రాడ్‌ పట్టుకొని బిల్డింగ్‌పై తిరుగుతూ కనిపించడం గమనార్హం. 

నేరం చేస్తే చర్యలు తీసుకోవచ్చు : సంజయ్‌ సింగ్‌
ఇంటెలిన్స్‌ అధికారి అంకిత్‌ శర్మ హత్య కేసులో ఆప్‌ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌పై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ స్పందించారు. ఏ వ్యక్తి అయినా.. ఏ మతానికి చెందినవాడైనా నేరం చేస్తే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. హింసాకాండ సమయంలో ఇంట్లోకి ఒక గుంపు ప్రవేశించడంపై మీడియాకు, పోలీసులకు తాహిర్‌ సమాచారం ఇచ్చారన్నారు. పోలీసులు 8గంటలు ఆలస్యంగా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నేరం చేస్తే ఏ పార్టీ నాయకుడైనా చర్యలు తీసుకోవాలన్నారు.

కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య మూడు రోజులుగా జరుగుతున్న అల్లర్లలో గురువారం నాటికి మృతుల సంఖ్య 35కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు.

>
మరిన్ని వార్తలు