-

ట్రంప్‌ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ 

26 Feb, 2020 02:30 IST|Sakshi

ఈశాన్య ఢిల్లీలో రెచ్చిపోయిన ఆందోళనకారులు

ఘర్షణల్లో 13 మంది మృతి

200 మందికి గాయాలు; పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం

144వ సెక్షన్‌ ఉన్నా... వీధుల్లో ముష్కరుల స్వైరవిహారం 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటిస్తుండగానే... అక్కడకు కాస్తంత దూరంలో హింస పెచ్చరిల్లింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతిస్తున్న వారు... వ్యతిరేకిస్తున్న వారు... రెండు వర్గాలూ పెట్రేగిపోయాయి. దీంతో  2 రోజుల్లో ఏకంగా 13 మంది బలైపోయారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సోమవారం మొదలైన ఘర్షణలు... మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులు అవతలివర్గం తాలూకు దుకాణాల్ని, వ్యాపార సముదాయాల్ని తగలబెట్టేయడంతో మంగళవారం స్థానిక వీధుల్లో ఎటుచూసినా పొగ కమ్మేసింది. అల్లరి మూకలు మారణాయుధాలతో వీధుల్లో స్వేచ్ఛగా స్వైరవిహారం చేశాయి. ఈ ఘర్షణల్లో సోమవారం 5 మంది, మంగళవారం మరో 8 మంది బలైపోయారు. మరో 200 మంది వరకూ గాయపడగా... వారిలో 48 మంది పోలీసులే!. కనిపిస్తే కాల్చివేయాలంటూ పోలీసులు లౌడ్‌స్పీకర్ల ద్వారా చెప్పారని మౌజ్‌పూర్‌ స్థానికులు చెప్పగా, అలాంటి ప్రకటన చేయలేదని డీసీపీ వేద్‌ప్రకాశ్‌ చెప్పారు.(సీఎన్‌ఎన్‌ X ట్రంప్‌)

మరిన్ని ప్రాంతాలకు చిచ్చు... 
ఈ అల్లర్లు మంగళవారం కొత్త ప్రాంతాలకు పాకాయి. ఆందోళనకారులు స్వేచ్ఛగా లూటీలు, దహనాలకు తెగబడటంతో చాంద్‌ భాగ్, భజన్‌పురా ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. గోకుల్‌పురిలోఅల్లరిమూకలు రెండు అగ్నిమాపక వాహనాల్ని ధ్వంసం చేశారు. దుండగులు కనిపించిన దేన్నీ వదిలిపెట్టకుండా.. పెట్రోల్‌ పోసి నిప్పుపెడుతూ రెచ్చిపోయారు. ఫలితం ధ్వంసమైన వాహనాల భాగాలు, కాలిపోయిన టైర్లు, రాళ్లు ఇటుకలతో అక్కడి రోడ్లన్నీ నిండిపోయాయి. రాళ్లు, రాడ్లు, ఆఖరికి కత్తులు కూడా పట్టుకుని ఆందోళనకారులు రెచ్చిపోవటంతో.. వారిని చెదరగొట్టడానికి భాష్పవాయువు ప్రయోగించారు. కొన్నిచోట్ల అల్లరిమూకలు సైతం హెల్మెట్లు ధరించడం గమనార్హం. మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, కరవల్‌నగర్, జఫరాబాద్‌లలో కర్ఫ్వూ విధించారు. (నమస్తే ట్రంప్‌ అదిరింది... )

అల్లర్లు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసుల కాల్పుల్లో గాయపడిన వ్యక్తి 

సగం మందికి బుల్లెట్‌ గాయాలే... 
మంగళవారం ఆసుపత్రికి తీసుకువచ్చిన వారిలో 8 మంది మరణించారని, మరో 35  మంది చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. గాయపడ్డ వారిలో సగం మంది బుల్లెట్‌ గాయాలు తగిలిన వారే. ఒకవైపు హింస కొనసాగుతుండగానే... మరో వైపు పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహించారు.  (కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!)


గవర్నరు, సీఎంలతో అమిత్‌షా భేటీ 
ఢిల్లీలో అల్లర్లపై హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నరు అనిల్‌ బైజాల్‌తో పాటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌ అమూల్య పట్నాయక్‌లు దీనికి హాజరయ్యారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలూ ఈ విషయంలో కలిసికట్టుగా వ్యవహరించాలని, అన్ని కాలనీల్లో తక్షణం శాంతి కమిటీలను పునరుద్ధరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గడిచిన దశాబ్దకాలంలో ఢిల్లీలో ఎన్నడూ ఇంతటి హింస చెలరేగలేదు. జేకే 24/7 న్యూస్‌ విలేకరికి, ఎన్‌డీటీవీ విలేకరులకు కూడా కొందరికి గాయాలయ్యాయి. చాలాచోట్ల 144వ సెక్షన్‌ విధించినా దాన్ని పాటించేవారే కరువయ్యారు. కాగా అల్లర్లను అదుపు చేయడానికి తమ వద్ద తగినన్ని బలగాలు లేవని, ఉంటే వెంటనే అదుపు చేసి ఉండేవారమని కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ హోంశాఖకు చెప్పినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఇది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఢిల్లీ పోలీస్‌ పీఆర్‌ఓ అధికారికంగా స్పందిస్తూ... అదంతా వాస్తవం కాదని, తమవద్ద తగినన్ని బలగాలున్నాయంటూ ప్రకటన విడుదల చేశారు.

హైకోర్టు, సుప్రీం విచారణ నేడు
ఈశాన్య ఢిల్లీలో 3 రోజులుగా చెలరేగుతున్న అల్లర్లలో హింసకు పాల్పడ్డ వారిని అరెస్ట్‌ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మంగళవారం వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం విచారిస్తామని ఆయా కోర్టులు కక్షిదారులకు తెలిపాయి. పిటిషన్‌ను మంగళవారమే విచారించాలని డిమాండ్‌ చేశారు. అయితే జస్టిస్‌ జి.ఎస్‌.సిస్థానీ, జస్టిస్‌ ఏ.జే.భంభానీలతో కూడిన బెంచ్‌ బుధవారం ఉదయం విచారిస్తామని స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా వీరు డిమాండ్‌ చేశారు. 

పోలీసులు మాయం
ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదని, ఆందోళనకారులు సాధారణ ప్రజలను బెదిరిస్తూ.. దుకాణాలను ధ్వంసం చేసుకుంటూ వెళ్లిపోయారని ఓ పౌరుడు తెలిపారు. 1984 సిక్కు అల్లర్ల తరువాత అంతటి పరిస్థితి కనిపించడం ఇదే తొలిసారి అని మరో వ్యక్తి చెప్పారు. ఆందోళన కారులు రువ్విన రాళ్లు తగిలి గాయపడ్డ హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ మరణించారని, అయితే మరణించిన ఇతరులు ఏ కారణంగా మరణించారో? చంపింది ఎవరో తెలియరాలేదని అధికారులు మంగళవారం తెలిపారు. నగరంలో పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ నగర సరిహద్దులను మూసివేయడం ద్వారా హింసకు పాల్పడే వారిని అడ్డుకోవచ్చునని సీఎం సూచించారు.

ట్రంప్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు