ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ

28 Feb, 2020 10:02 IST|Sakshi

నిత్యావసరాల కొనుగోలుకి వెళ్లి అనంతలోకాలకు.. 

సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసాకాండలో మృతి చెందిన వారి కుటుంబాలు శోకసంద్రంలో మునుగిపోయాయి. ఢిల్లీ ఘర్షణలలో మొదటి మృతుడు ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌ లాల్, గోకుల్‌ పురి పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న అతడు బుల్లెట్‌ గాయాలతో మరణించాడు. ఆయనకు భార్య ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. 24 ఏళ్ల షాహిద్‌ అల్వీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. (అంకిత్ శర్మ హత్య: తాహిర్పై ఆప్ వేటు)

సోమవారం మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా ముస్తాఫాబాద్‌లో తుపాకి కాల్పులకు గురై మరణించాడు. రక్తం మడుగులో పడి ఉన్న అల్వీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అల్వీకి ఆరు నెలల కిందటే వివాహమైంది. పాలు కొనుక్కువస్తానని ఇంటి నుంచి బయలుదేరిన మెహ్తాబ్‌ మళ్లీ ఇంటికి చేరుకోలేదు. మంగళవారం ఐదు గంటలకు  ఇంటి నుంచి  బయలుదేరిన  21 సంవత్సరాల మెహ్తాబ్‌ బుధవారం ఉదయం 5 గంటలకు లోక్‌నాయక్‌ ఆసుపత్రిలో కన్నుమూశాడు. అతను నిర్మాణ కూలిగా పనిచేస్తున్నాడు. (వాచ్మెన్ పారిపోయాడు.. నిప్పు పెట్టారు..)

26 సంవత్సరాల రాహుల్‌ సోలంకి మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. ఘర్షణలు జరుగుతండడంతో అతను సోమవారం ఆఫీస్‌కు సెలవు తీసుకుని ఇంట్లో ఉండిపోయాడు. టీకి పాలులేకపోవడంతో పాలు కొనుక్కొస్తానని ఇంటినుంచి బయటకెళ్లిన తన కొడుకును ఇంటికి వంద మీటర్ల దూరంలోనే కొందరు చుట్టుముట్టి పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చిచంపారని అతని తండ్రి హరి సింగ్‌ సోలంకి చెప్పారు. ముస్తాఫాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే 22 సంవత్సరాల ఆష్వాక్‌ హుస్సేన్‌కు ఫిబ్రవరి 14నే వివాహమైంది. పెళ్లి జరిగిన 11 రోజులకే అతను విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పని ముగించుకుని ఇంటికి వస్తున్న అష్వాక్‌ను పొడిచి చంపారని అతని పినతల్లి తెలిపింది. మహ్మద్‌ ఫుర్ఖాన్‌ పెళ్లి కార్డుల వ్యాపారం చేస్తుంటాడు. జఫరాబాద్‌లో ఆదివారం నుంచి ఘర్షణలు జరుగుతండడంతో ఇంటికి కావలసిన సామాన్ల కోసం బయలుదేరిన అతను బుల్లెట్‌ తగిలి ఆసుపత్రిలో కన్నుమూశాడు. 32 సంవత్సరాల ఫుర్ఖాన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. (ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు)

ముబారక్‌ హుస్సేన్‌ రోజు కూలిగా పనిచేసేవాడు. బాబర్‌పుర్‌ విజయ్‌పార్క్‌ కాలనీలో బుల్లెట్‌ గాయమై అక్కడికక్కడే మరణించాడు. రక్తం మడుగులో పడి ఉన్న అతని మృతదేహాన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కరావల్‌ నగర్‌లో నివసించే  వీర్బాన్‌ సింగ్‌ మౌజ్‌పుర్లో డ్రై క్లీనింగ్‌ దుకాణం నడిపేవాడు. ఇంటికి తిరిగివస్తుండగా తలకు బుల్లెట్‌ తగిలి 50 ఏళ్ల వీర్బాన్‌ చనిపోయాడని అతని సోదరుడు చెప్పాడు. 35 సంవత్సరాల నజీంఖాన్‌కు ఆరుగురు పిల్లలు. తుక్కు వ్యాపారం చేసే ఖాన్‌ ఇంటికి సామాన్లు కొనుక్కొస్తానని చెప్పి బయలుదేరి శవమై తిరిగివచ్చాడు. (ఢిల్లీ ఘర్షణలపై స్పందించిన ఆరెస్సెస్)

ముదస్సిర్‌ ఖాన్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. కర్దమ్‌పుర్‌లో నివసించే ఇతనికి మూడేళ్ల కుమార్తె, ఏడాది కొడుకు ఉన్నారు. ఇంటికి కావలసిన సామాన్లు కొనుక్కొస్తానని బయలుదేరి తిరిగిరాలేదు. మంగళవారం నుంచి ఇంటికి రాని 24 ఏళ్ల మొహసీన్‌ అలీని వెతుకుతూ జీటీబీ ఆసుపత్రికి వచ్చిన అతని కుటుంబానికి మార్చురీలో మృతదేహం లభించింది. అలీకి  రెండు నెలల కిందటే వివాహమైంది. 85 ఏళ్ల అక్బరీ ఇంటికి నిప్పంటించడంతో మరణించింది. ఆమె కొడుకు ఇంటి మొదటి రెండు అంతస్తులలో దుస్తుల దుకాణం నడిపేవాడు. కాగా ఢిల్లీని వణికించిన అల్లర్లలో 38మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చెదురు మదురు ఘటనలు మినహా పరిస్థితి అదుపులోనే ఉంది. (అంకిత్ శర్మ హత్య కేసులో కొత్త ట్విస్ట్)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా