ఢిల్లీ అల్లర్లు: మిరాకిల్‌ బాబు..!

28 Feb, 2020 10:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆ బాబు జన్మ నిజంగా ఆ కుటుంబానికి అద్భుతమే. జీవితాలపై ఆశలు వదిలేసుకున్న క్షణాల నుంచి, పొత్తిళ్లలో పసిగుడ్డును ప్రాణాలతో చూసుకునే క్షణం వరకు.. ఆ కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపింది. షబానా పర్వీన్‌ నిండు గర్భిణి. సోమవారం రాత్రి ఆమె తన భర్త, అత్త, ఇద్దరు పిల్లలతో ఈశాన్య ఢిల్లీలో ఉన్న కరవాల్‌నగర్‌లోని తమ ఇంట్లో నిద్రపోతోంది. హఠాత్తుగా ఒక గుంపు ఆ ఇంట్లోకి చొరబడింది. బూతులు తిడుతూ ఆ కుటుంబంపై దాడికి దిగింది. పర్వీన్‌ భర్తను విచక్షణారహితంగా కొట్టింది. పర్వీన్‌ పైనా దాడి చేసింది. ఆమె పొత్తికడుపుపైనా కొట్టారు. ఇంటికి నిప్పంటించారు. ప్రాణాలు దక్కవనే ఆ కుటుంబం భావించింది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ కుటుంబం దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు అల్‌ హింద్‌ ఆసుపత్రికి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లారు. అక్కడ పర్వీన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. (ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ)

ఈ సందర్భంగా పర్వీన్‌ అత్త నసీమా మాట్లాడుతూ.. గుంపుగా వచ్చిన కొందరు మమ్మల్ని దూషించారు. నా కొడుకును కొట్టారు. వారిలో కొందరు గర్భిణి అయిన నా కోడలును పొత్తి కడుపులో తన్నారు. వారి బారి నుంచి ఆమెను రక్షించడానికి వెళితే నాపై కూడా దాడి చేశారు. మాకు ఆ రాత్రి కాళరాత్రే అవుతుందని అనుకున్నాం.  దేవుడి దయతో మేము ప్రాణాలతో బయటపడ్డాం. ఈ దాడిలో మేం సర్వం కోల్పోయినా ... బిడ్డ పుట్టడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు మా కుటుంబం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితి. మాకు ఏమీ మిగల్లేదు. మా స్వస్థలానికి వెళ్లి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే’ అని వాపోయింది. కాగా  ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు. ఉన్మాద ముకలు ఇళ్ళు, షాపులపై దాడి చేసి, వాహనాలకు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. (అంకిత్ శర్మ హత్య: తాహిర్పై ఆప్ వేటు)

>
మరిన్ని వార్తలు