కరోనాపై పోరు: 100 మందిని కాపాడినా చాలు!

10 Apr, 2020 10:16 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా(కోవిడ్‌19) కోరలు చాస్తున్న వేళ సాటి మనుషులకు బాసటగా నిలిచేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమకు చేతనైన సాయం చేస్తూ కరోనాపై పోరులో విజయం సాధించేందుకు చేయూతను అందిస్తున్నారు. ఢిల్లీకి చెందిన 15 మంది మహిళలు కూడా తాజాగా ఈ జాబితాలో చేరారు. ఓ ఎన్జీఓ చేపట్టిన కార్యక్రమంలో భాగస్వామ్యమై వందల కొద్దీ మాస్కులు కుడుతూ తమ వంతు బాధ్యత నెరవేరుస్తున్నారు. పరిశుభ్ర వాతావరణంలో పనిచేస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ తమల్ని తాము కాపాడుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.(కరోనా: గొప్పవాడివయ్యా)

ఈ విషయం గురించి గూంజ్‌ ఫౌండేషన్‌ సభ్యుడు మాట్లాడుతూ... ‘‘మా దగ్గర పదిహేను మంది సభ్యులు ఉన్నారు. కాటన్‌, ఫ్యూజింగ్‌ పేపర్‌ ఉపయోగించి మాస్కులు తయారు చేస్తున్నాం. రోజుకు 400- 500 మాస్కులు కుట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు 1200 దాకా తయారు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్యను 1500కు చేర్చాలని భావిస్తున్నాం. అంతేకాదు మాస్కులతో పాటు గోధుమలు, బియ్యం, ఇతర వంట సరుకులు కూడా అందజేస్తున్నాం అని తెలిపారు.(మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య, కుమార్తె)

ఇక 15 మంది సూపర్‌ వుమన్‌లో ఒకరైన సుధా మిశ్రా మాట్లాడుతూ.. ఈ పని తనకు ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో మేం చేసే సాయం కనీసం వంద మందికి ప్రయోజనం చేకూర్చినా తమ జన్మ ధన్యం అవుతుందన్నారు. ఎంత కష్టమైనా పనిని పూర్తి చేస్తాం.. వీలైనన్ని ప్రాణాలు కాపాడుతాం అని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఎన్జీఓను రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత అన్షు గుప్తా ప్రారంభించారు. ఇక ప్రతీ ఒక్కరు విధిగా మాస్కు ధరించాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.(మేము సైతం అంటున్న హిజ్రాలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు