'అర్థం మారిన వందేమాతరం పేరు మాకొద్దు!'

20 Nov, 2017 17:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా పనిచేస్తున్న దయాళ్‌ సింగ్‌ ఈవినింగ్‌ కళాశాల పేరును మార్చాలని నవంబర్‌ 17వ తేదీన కాలేజీ గవర్నింగ్‌ బాడీ నిర్ణయించింది. కాలేజీ పేరును 'వందేమాతరం మహా విద్యాలయం'గా మార్చాలని కాలేజీ గవర్నింగ్‌ బాడీ చైర్‌పర్సన్, లాయర్, బీజేపీ సభ్యుడు అమితాబ్‌ సిన్హా సూచించారు. కొంత మంది మాత్రమే ఈ పేరును వ్యతిరేకించారని, ఎక్కువ మంది సభ్యులు సమర్థించారని కళాశాల ప్రిన్సిపాల్‌ పవన్‌ కుమార్‌ శర్మ తెలిపారు. ఆయనతోపాటు కాలేజీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు దివాకర్‌ యాదవ్‌లు పేరు మార్పు పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. వందేమాతరం లౌకికవాదమేనని వారు వాదిస్తున్నారు.
 
దేశానికి స్వాతంత్య్రం రాకముందుకు, ఇప్పటికీ వందేమాతరం నినాదంకు అర్థం మారిపోయిందని, స్వాతంత్య్రానికి ముందు వందేమాతర గీతాన్ని అన్ని మతాల వారు గౌరవించారని, ఇప్పుడు దానికి అర్థమే మారిపోయిందని, మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఈ పదాన్ని, ఈ గీతాన్ని హిందూ శక్తులు ఉపయోగిస్తున్నాయని కాలేజీ గవర్నింగ్‌ బాడీలోని కొంత మంది సభ్యులు, అధ్యాపకులు, వామపక్ష విద్యార్థులు, విద్యావంతులు విమర్శిస్తున్నారు. పైగా పేరు మార్చడమంటే ప్రముఖ లౌకికవాది, విద్యావేత్త దయాళ్‌ సింగ్‌ను అవమానించడమేనని వారు వాదిస్తున్నారు.
 
'దయాళ్‌ సింగ్‌ లౌకిక వాది. ఆయన వద్ద ముస్లిం, క్రైస్తవ మతానికి చెందిన వంటవాళ్లు పనిచేసే వారు. ఆయన సిక్కు, హిందూ, క్రిస్టియన్,  పార్శియన్‌ మిత్రులతో కలిసి డైనింగ్‌ టేబుల్‌పై కలసి భోంచేసేవారు. వారు కలిసి వైన్‌ కూడా సేవించేవారు. ఆయన కుటుంబానికి చెందిన వారిలో కొందరు అమృత్సర్‌లోని స్వర్ణదేవాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహించేవారు. అమృత్సర్‌లోనే క్రైసవ మిషనరీ స్కూల్లో చదువుకున్న దయాళ్‌ సింగ్‌ భగవద్గీతలోపాటు బైబిల్, ఖురాన్‌లను కూడా క్షుణ్ణంగా చదువుకున్నారు. ఆయనకు క్రైస్తవ గురువులకన్నా క్రైస్తవం గురించి ఎక్కువగా తెలుసు. ఫిరోజ్‌పూర్‌కు చెందిన ఓ సంస్కత పండితుడి సహకారంతో ఆయన గీతను అధ్యయనం చేశారు' అని 1998లో దయాళ్‌ సింగ్‌ శతజయంతి (1849-1898) సందర్భంగా ప్రముఖ విద్యావేత్త మదన్‌ గోపాల్‌ రాశారు. దాన్ని 'ది ట్రిబ్యూన్‌' మ్యాగజైన్‌లో ప్రచురించారు. 

పాకిస్థాన్‌లోని లాహోర్‌ కేంద్రంగా ఏర్పాటైన దయాళ్‌ సింగ్‌ కాలేజ్‌ ట్రస్ట్‌ సొసైటీ తమ తొలి కాలేజీని 1910లో లాహోర్‌లో ఏర్పాటు చేశారు. దేశ విభజన జరగడంతో ఆ ట్రస్ట్‌ భారత్‌కు తరలి వచ్చింది. ఆ ట్రస్ట్‌ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత అంటే, 1956లో ఢిల్లీలో దయాళ్‌ సింగ్‌ పేరిట ఈవెనింగ్‌ కాలేజీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సంవత్సరానికి డే కాలేజీని కూడా ఏర్పాటు చే సింది. ఢిల్లీ యూనివర్శిటీ 1978లో రెండు కాలేజీల నిర్వహణ బాధ్యతలను ట్రస్ట్‌ నుంచి స్వీకరించింది. ఇటీవలి కాలంలో ఆదరణ తగ్గిపోతుండడంతో ఈవెనింగ్‌ కాలేజీని డే కాలేజీగా మార్చాలని ఐదు నెలల క్రితం ఢిల్లీ యూనివర్శిటీ నిర్ణయం తీసుకొంది. డే కాలేజీలో ఆరువేల మంది విద్యార్థులు, ఈవెనింగ్‌ కాలేజీలో రెండున్నర వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు కాలేజీలకు మొదటి నుంచి ప్రిన్సిపాల్‌ సహా సిబ్బంది అంతా వేర్వేరుగానే ఉన్నారు. అలాగే ఇప్పుడు నైట్‌ కాలేజీని డేకు మార్చినప్పటికీ ప్రత్యేక సిబ్బందిని అలాగే కొనసాగించాలని ఢిల్లీ యూనివర్శిటీ నిర్ణయించింది. దాంతో కాలేజీ పేరును మార్చాల్సిన అవసరం ఏర్పడింది. 

11 ఎకరాల ఆవరణలో కొనసాగుతున్న రెండు కాలేజీలను డే కాలేజీలుగా మార్చడం వల్ల మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతోందని, వాటిని కల్పించేందుకు 11 ఏకరాల స్థలం సరిపోదని కాలేజీ గవర్నింగ్‌ బాడీలో, టీచర్లలో, ఇటు విద్యార్థుల్లో ఒక వర్గం వాదిస్తోంది. పేరు మార్పుకన్నా ఈ సౌకర్యాలపైనే దష్టిని కేంద్రీకరించడం మంచిదని వారంటున్నారు. ప్రస్తుతం ఉన్న కాలేజీ పేరునే ఉంచాలనుకుంటే 'దయాళ్‌ సింగ్‌ కాలేజీ-1, -2 అని పెట్టుకోవచ్చని, పూర్తిగా పేరు మార్చాల్సిన అవసరమే లేదని ఆ వర్గం సూచిస్తోంది. పేరేదైనా సౌకర్యాలు కల్పిస్తే చాలని మరో వర్గం వాదిస్తోంది. ఇప్పటికే డేకి కాలేజీని మార్చినందున పెద్ద ఇబ్బందులేవీ లేవని, ఉన్న ఆవరణలోనే అదనపు భవనాలు నిర్మిస్తే సరిపోతుందని వందేమాతరం పేరును కోరుకుంటున్న వర్గం భావిస్తోంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా