అందుబాటు తప్ప.. అందినదేమీ లేదు!

2 Feb, 2020 03:12 IST|Sakshi

రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ గడువు మరొక ఏడాది పొడిగింపు

అఫడబుల్‌ డెవలపర్లకు లాభాల మీద పన్నుకు కూడా..

కొత్త ఎయిర్‌పోర్ట్స్, లాజిస్టిక్‌ పాలసీలతో కమర్షియల్‌ రియల్టీకి డిమాండ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మళ్లీ పాత పాటే పడింది. జీఎస్‌టీ తగ్గింపు, మౌలిక రంగ హోదా, ఇన్వెంటరీ గృహాలకు పన్ను మినహాయింపు, డెవలపర్స్‌ సబ్‌వెన్షన్, కొనుగోలుదారుల ఫిర్యాదు కోసం రెరా సింగిల్‌ బాడీ ఏర్పాటు వంటి వాటితో రియల్టీలో జోష్‌ నింపుతుందనుకున్న బడ్జెట్‌ నీరుగార్చింది. అందుబాటు గృహ కొనుగోలుదారులు, వాటి నిర్మాణదారులకు మినహా రియల్టీ రంగానికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. లాజిస్టిక్‌ పాలసీ, కొత్త యూనివర్సీటీలు, విమానాశ్రయాలు, స్మార్ట్‌ సిటీలు, డేటా సెంటర్లతో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అవకాశాలను కల్పించారు. రవాణా, మౌలిక రంగ వసతుల కేటాయింపులతో దీర్ఘకాలంలో గృహ విభాగానికి డిమాండ్‌ వస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

 అందుబాటు గృహాల మీదే ఫోకస్‌..
తొలిసారి ఇల్లు కొనే వారికి అందించే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ గడువును మరొక ఏడాది పొడిగించారు. అంటే అఫోర్డబుల్‌ హౌజింగ్‌ వడ్డీ రాయితీని 2021 మార్చి వరకు పొందే వీలుందన్నమాట. అందుబాటు గృహాల నిర్మాణదారులకు లాభాల మీద 100 శాతం పన్ను మినహాయింపు లను మరో ఏడాది పొడిగించింది. పెరిగిన ఏడాది పన్ను మినహాయింపు లాభాలను పూర్తి స్థాయిలో వినియోగిం చుకునేందుకు కొనుగోలుదారులు, డెవలపర్లు ముందుకొస్తారు కాబట్టి అఫోర్డబుల్‌ హౌజింగ్స్‌కు డిమాండ్‌ పెరుగుతుందని నరెడ్కో నేషనల్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌ హిర్‌నందానీ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆదాయపన్ను శాతాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. ఇది ఆయా పన్ను చెల్లింపుదారులకు రియల్టీ పెట్టుబడులకు అవకాశమిస్తుందని టాటా రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ అండ్‌ సీఈఓ సంజయ్‌ దత్‌ తెలిపారు.

రియల్టీకి కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌ దారులు..
డేటా సెంటర్లు, కొత్త విమానాశ్రయాలు, స్మార్ట్‌ సిటీలతో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు అవకాశాలు మెరుగవుతాయని జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓ రమేష్‌ నాయర్‌ అన్నారు. ఢిల్లీ–ముంబై, బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేస్, బెంగళూరు సబర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాజెక్ట్‌లతో మౌలిక రంగంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పెరగడంతో పాటూ ఆయా మార్కెట్లలో డెవలపర్లకు కొత్త పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయి. కొత్తగా వంద విమానాశ్రయాలు, ఐదు స్మార్ట్‌ సిటీలు, డేటా సెంటర్లతో కమర్షియల్‌ రియల్టీకి అవకాశాలు వస్తాయని తెలిపారు. 2024 నాటికి పరిశ్రమ ఆదాయం 3.2 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పేర్కొంది.

లాజిస్టిక్‌ బూస్ట్‌..
నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీ ప్రకటనతో వేర్‌హౌజ్, లాజిస్టిక్‌ రంగంలో సరఫరా పెరుగుతుంది. గతేడాది దేశంలో 21.1 కోట్ల చ.అ.లుగా ఉన్న వేర్‌హౌజ్‌ సప్లయి 2023 ముగింపు నాటికి 37.9 కోట్ల చ.అ.లకు చేరుతుందని అనరాక్‌ కన్సల్టెన్సీ అంచనా వేసింది. సింగిల్‌ విండో క్లియరెన్స్‌తో వేర్‌హౌజ్‌ అనుమతుల సమయం 6 నెలలకు తగ్గిపోతుంది. 2019లో దేశంలోని ప్రధాన నగరాల్లో 3.6 కోట్ల చ.అ. వేర్‌హౌజ్‌ నికర లావాదేవీలు జరిగాయి. సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ ఇంట్రెస్ట్‌ యాక్ట్‌ (సర్ఫాసీ చట్టం) కింద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల అసెట్స్‌ నిర్వహణను రూ.500 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించారు. దీంతో మధ్యలోనే ఆగిపోయిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల నిధులను రికవర్‌ చేయడానికి మరింత అవకాశం ఉంటుంది. ఆగిపోయిన ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించాలి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా