నోట్ల రద్దుకు ప్రజామోదం..

8 Dec, 2016 03:43 IST|Sakshi
నోట్ల రద్దుకు ప్రజామోదం..

ఈ నిర్ణయం జనశక్తి ప్రాముఖ్యతను తెలియజేసింది
 ప్రతిపక్షాలకు చర్చలో పాల్గొనే ఉద్దేశం లేదు
 పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ

 
 న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దుకు ప్రజలంతా మద్దతిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం.. ‘జనశక్తి’ ప్రాముఖ్యతను తెలియజెప్పిందని అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెం ట్‌లో నోట్ల రద్దుపై చర్చ జరగాలని విపక్షాలు భావించడం లేదని, రాజ్యసభలో ఈ విషయం స్పష్టమవుతోందని ఆరోపించారు. తాను రెండుసార్లు రాజ్యసభకు హాజరైనా చర్చకు వారు అంగీకరించలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాలు ఘర్షణలకు, ఉద్రిక్తతలకు దారి తీశాయని, అయినా వాటిపై పార్లమెంట్‌లో చర్చ నడిచిం దన్నారు. అయితే ఇప్పుడు అత్యంత కీలకమైన నోట్ల రద్దు నిర్ణయంపై చర్చకు మాత్రం ప్రతిపక్షాలు అంగీకరించడం లేదని అన్నారు.
 
 ప్రజలను చైతన్యవంతులను చేయాలి
 పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ ఎకానమీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించారని చెప్పారు. ఓట్ల నమోదు, ఈవీఎంల వినియోగంపై ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తామో అదే విధంగా దీనిపై వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారన్నారు. పార్టీలకతీతంగా అందరు ఎంపీలు ఇందులో భాగస్వాములు కావాలని మోదీ కోరారని అనంత్‌కుమార్ చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలు నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ‘రాజ్యశక్తి’ కంటే ‘జనశక్తి’కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ప్రస్తుతం తమ ప్రభుత్వం దీని ప్రాముఖ్యతను తెలియజెప్పిందన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు నోట్ల రద్దుపై చర్చ జరగాలనే ఉద్దేశం లేదని, అందువల్ల దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పార్టీ సభ్యులు నడుచు కోవాలని సూచించారని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏ పార్టీ డిమాండ్ చేయలేదని, అందువల్ల విపక్షాలు చర్చలో పాల్గొని విలువైన సలహాలు అందజేయాలని మోదీ సూచించారన్నారు.
 

>
మరిన్ని వార్తలు