డీమానిటైజేషన్‌‌.. రోడ్డెక్కిన భారత్‌

8 Nov, 2017 10:27 IST|Sakshi

తమకు వచ్చిన చాలీచాలని జీతం మొత్తం ఖర్చు చేసి, మళ్లీ ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే మధ్యతరగతి వారే భారత్‌లో ఎక్కువ. ఈ జీవనశైలికి దాదాపు అలవాటుపడి, సమాజంలో ఓ భాగంగా ఇమిడిపోయింది మధ్య తరగతి బడుగు జీవి జీవితం. ఇక లిక్విడ్ డబ్బు విషయానికొస్తే అకౌంట్‌లో సొమ్ము పడిన మరుక్షణమే ఎప్పుడు డ్రా చేద్దామా అనుకోవడము కూడా మధ్యతరగతిజీవికి సహజమే. అద్దె, కరెంటు బిల్లు, కేబుల్‌ బిల్లు, పెట్రోల్‌, డీజిల్‌, ఇంట్లో సరుకులు, ఆసుపత్రుల ఖర్చులు, పిల్లల స్కూల్‌ ఫీజు, ఇంట్లో అవసరాలకు, ఖాతాలో తీసుకున్న వస్తువులకు నెలనెలా కడుతున్న ఈఎంఐలు..ఇలా చెబుతూ పోతుంటే.. చివరకు జేబులో ఏమీ మిగలకపోయినా అన్ని చోట్ల డబ్బు కట్టాములే అనే ఏదో తెలియని ఆనందంలో చిన్న, మధ్య తరగతివాసులు బతికేస్తున్నారు.

ప్రతి రోజు వార్తల్లో రూ. లక్షల దగ్గరి నుంచి మొదలు పెడితే రూ. లక్షల కోట్ల వరకు కుంభకోణాలు జరుగుతున్నాయని వింటున్న సామాన్యునికి ఏదో తెలియని కోపం. తాము ఇంత కష్టపడి బతుకుతుంటే కొందరు మాత్రం అక్రమార్జనతో కోటాను కోట్లు కూడబెడుతున్నారని సమాజం మీద కొంత అసహనం. సరిగ్గా అదేసమయంలో నోట్ల రద్దు వార్త అదికూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చింది. నల్ల డబ్బుపై నవంబర్‌ 8న పొద్దుపోయాక కేంద్ర ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం అన్ని వర్గాలనూ నివ్వెరపరిచింది.

గతేడాది నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ చేసిన పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలేమిటో తెల్లారి రోడ్డెక్కేవరకూ చాలామందికి అర్ధం కాలేదు. రద్దయిన పెద్ద నోట్లు ఈ క్షణం నుంచి చిత్తు కాగితాలతో సమానమని స్వయానా దేశ ప్రధానే ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. 'దేశ చరిత్రలో జాతి నిర్మాణానికి సంబందించిన ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్నే వస్తాయి. అందులో పాలు పంచుకునే క్రమంలో చిన్న చిన్న కష్టాలు పట్టించుకోకండి. ఉగ్రవాదం, నల్లధనం, అవినీతిని కూకటి వేళ్లతో పెకలించాలి. ఈ జాడ్యాలు మానని పుండులా మారాయి. జాతిని తొలిచేస్తున్నాయి. వీటిపై పకడ్బందీగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చట్ట వ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు దేశానికి అతిపెద్ద ముప్పు' అవినీతిని ఊడ్చేద్దాం అంటూ మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఇక అక్రమమార్గాల్లో ఇష్టానుసారంగా డబ్బు సంపాదించిన వారి పని అయిపోయింది. రేపో మాపో అందరూ దొరికిపోతారు. సమాజంలో మార్పు తథ్యం అంటూ తొలుత సామాన్యుడు ఆనందంలో మునిగితేలాడు. రోజులు గడుస్తున్నాయి. మార్పు సంగతి దేవుడెరుగు. సామాన్యుడి ఆనందం పూర్తిగా తగ్గడం ప్రారంభమైంది. ఏ చిన్న అవసరానికైనా ఎక్కడికెళ్లినా లిక్విడ్ క్యాష్‌ కోసం అడిగే వారే. కార్డుతో డబ్బు కడతామంటే ఏదో పర్సంటేజ్ కట్టాలి అని అడిగే వారే. సరెలే డబ్బు డ్రా చేసి ఖర్చులకు వాడుకుందామంటే ఏటీఎంలు ఒక్కటీ పని చేయవు. బ్యాంకుల్లో డ్రా చేద్దామని వెళితే భారీ లైన్లు.

పెళ్లి-చావు ఖర్చులకూ సామాన్యుడికి తిప్పలే
ఇక ఏదైనా ఫంక్షన్‌ లాంటివి ఉంటే ఇక వారి సంగతి అంతే. పెళ్లిళ్ల దగ్గరి నుంచి చావు కార్యక్రమాల వరకు అన్ని చోట్ల నోట్ల కష్టాలే. చెమటోడ్చి సంపాదించిన చాలీ చాలని జీతాన్ని డ్రా చేయాలంటే కఠోరంగా శ్రమించాల్సిందే. ఒకవేళ డబ్బు దొరికినా ఆ ఆనందం ఎంతోసేపు ఉండేది కాదు. రూ. 2000 నోటు తీసుకొని ఎక్కడికి వెళ్లినా చిల్లర సమస్యే. మధ్య తరగతికి చెందిన వారు సాధారణంగా ఏదైనా కొనాలనుకుంటే వంద రూపాయాల్లోపో మరీ కాదనుకుంటే ఓ ఐదు వందలలోపో కొనుగోలు చేస్తారు. చాలా సార్లు మాత్రం రూ. 2000 నోటుతో ఎక్కడైనా ఏదైనా కొనుగోలు చేయడానికి వెళితే మాత్రం తీసుకునే వారు కరువయ్యారు.


బ్యాంకు క్యూలైన్లోనే ఓ వ్యక్తి మృతి. పలానా ఉర్లో డబ్బులేక ఆగిపోయిన ఓ అమ్మాయి పెళ్లి. అంతిమ సంస్కారాలకు కూడా చేతిలో డబ్బులేక ఇబ్బంది పడ్డ కుటుంబం. డబ్బు లేక ఆసుపత్రిలో వైద్యం అందని రోగులు. డబ్బు డ్రా చేయడానికి వంద కిలో మీటర్లు ప్రయాణించి పలానా వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చదివినా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ వార్తలు అన్ని రాష్ట్రాల్లో సర్వసాధారణమయ్యాయి. అకౌంట్‌లో డబ్బు ఉండి కూడా డిమోనిటైజేషన్ తర్వాత సామాన్యుడు పడ్డ బాధలే దర్శనమిచ్చాయి.

నల్ల కుభేరులు దొరికారా?
ముందస్తు సమాచారం లేకుండా అంత పెద్ద నిర్ణయాన్ని వెల్లడించడం తప్పులేదు. కానీ, సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోలేకపోవడం మాత్రం కచ్చితంగా తప్పిదంగా భావించవచ్చు. ఓ వైపు కొంత మంది బ్యాంకు సిబ్బంది సమయానికి మించి శ్రమిస్తుంటే మరికొందరు మాత్రం 'కంచే చేనును మేసింది' అన్న చందంగా డబ్బున్న వాళ్లతో కుమ్మక్కాయరన్న వార్తలు సామాన్యున్ని మరింత బాధపెట్టాయి. గంటల తరబడి క్యూలైన్లో నిలబడితే కానీ, దొరకని రూ.2000 నోటు కొందరు బడాబాబుల ఇళ్లలో కుప్పలు కుప్పలుగా ఐటీదాడుల్లో బయటపడుతుంటే, మనం పడే నోట్ల కష్టమంతా నల్లధన రహిత భారతదేశం కోసమే కదా అని అనుకునే వారిని కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. బతకనేర్చినోడు ఎలాగైనా బతికేస్తాడు.. అనేలా.. నల్లకుభేరులు బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకోవడానికి బంగారాన్ని, విదేశీ కరెన్సీని కొనుగోలు చేశారన్న వార్తలు వచ్చినప్పుడల్లా.. అయ్యో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించ లేకపోయిందా అంటూ ఓ చిన్న నిట్టూర్పు. డీమానిటైజేషన్‌ ప్రకటన వచ్చి నేటితో సరిగ్గా సంవత్సర కాలం గడిచింది. ఈ ఏడాదిలో కనీసం ఒక్క నల్లకుభేరుడినయినా ప్రభుత్వం పట్టుకుందా అంటే ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.

దేశ చరిత్రలో జాతినిర్మాణానికి సంబంధించి ఇలాంటి సందర్భాలు మాత్రం రాకూడదని ప్రతి ఒక్కరు అనుకునేలా సామాన్యులు ఇబ్బంది పడ్డారు. ఉగ్రవాదం, నల్లధనం, అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలంటే వ్యవస్థలో మార్పులు రావాలి కానీ, సామాన్యులని రోడ్డెక్కించాలా అంటూ పెద్దస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముందస్తుగా బ్యాంకులను బలోపేతం చేసి కఠిన నిబంధనలు పెట్టి, డీమానిటైజేషన్‌ లాంటి ఓ నిర్ణయాన్ని తీసుకుంటే సామాన్యుడికి కొంతలో కొంతైనా మేలు జరిగేదేమో.

సాక్షి దినపత్రికలో వచ్చిన కొన్ని ఆసక్తికర వార్తలు..

కొన్ని కుటుంబాల్లో విషాదం నింపిన డీమానిటైజేషన్‌‌..


 ప్రముఖుల కామెంట్లు..

సామాన్యుడి నోట్ల తిప్పలు

మరిన్ని వార్తలు