ఆగ్నేయ ఆసియానే వణికిస్తున్న ‘డెంగ్యూ’

10 Sep, 2019 18:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒక్క భారత దేశాన్నే కాదు, ఆగ్నేయాసియాలోని వియత్నాం, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాలను కూడా ఈసారి డెంగ్యూ జ్వరలు తీవ్రంగా వణికిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు తెలియజేస్తున్నాయి. వియత్నాంలో ఒక్క జూలై నెల నాటికే 1,15,186 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 29 వేల డెంగ్యూ కేసులు నమోదుకాగా, ఈసారి లక్ష దాటి పోవడం గమనార్హం. ఫిలిప్పీన్స్‌లో జూలై నెల నాటికి 1, 46, 062 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది అదే ఫిలిప్పీన్స్‌లో 69 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. థాయ్‌లాండ్‌లో 43, 200 డెంగ్యూ కేసులు నమోదవడంతో ఆ దేశంలో వైద్య అత్యయిక పరిస్థితి ప్రకటించారు. అక్కడే గతేడాది జూలై నెల నాటికి 28,100 డెండ్యూ కేసులు నమోదయ్యాయి.

కంపోడియాలో 39 వేల కేసులు, గతేడాది మూడు వేల కేసులు నమోదయ్యాయి. లావోస్, మలేసియా, సింగపూర్, తైవాన్‌ దేశాల్లో కూడా ఈసారి ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ఆగ్నేయాసియా దేశాల్లో కాకుండా అమెరికన్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం అమెరికా దేశాల్లో కూడా డెంగ్యూ వ్యాధి ఎక్కువగానే ఉంది. ఈసారి బ్రెజిల్, కొలంబియా, హోండురస్, నికరాగ్వా దేశాల్లో ఆగస్టు మూడవ తేదీ నాటికి  5,84,263 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా 1970 దశకం నుంచే డెంగ్యూ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అత్యధిక జన సాంద్రతతో కిక్సిర్సిన రియో డీ జెనీరియో, ఓ చి మిన్‌ సిటీ నగరాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాదే డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదవడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా జూలై నెలలో వాతావరణం వామ్‌ (వేడిగా) ఉండడమని ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’కు చెందిన డాక్టర్‌ రాచెల్‌ లోవే తెలియజేశారు. భారత లాంటి సమశీతోష్ణ మండలాల్లో ఉష్ణోగ్రత సగటు 25 సెంటిగ్రేట్‌ డిగ్రీలు ఉంటే వామ్‌గాను, 35 డిగ్రీలు ఉంటే హాట్‌గాను పరిగణిస్తాం. మొత్తం అంతర్జాతీయంగా, అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఎన్నడు లేని విధంగా (ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా నోట్‌ చేస్తున్న 1880 సంవత్సరం నుంచి) జూలై నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందట. ఈ వామ్‌ వాతావరణంలో డెంగ్యూ వైరస్, వాటిని క్యారీ చేసే దోమలు క్రియాళీలకంగా ఉంటాయని డాక్టర్‌ రాచెల్‌ తెలిపారు. మురుగు నీరు, కుంటలతోపాటు ప్లాస్టిక్‌ వాటర్‌ కంటెనైర్లు, మొక్కల కుండీలు దోమల గుడ్లకు నిలయాలుగా మారుతున్నాయని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు.

డెంగ్యూ వైరస్‌ సోకితే కళ్లలోపల మంట, జ్వరంతోపాటు విపరీతమైన తలనొప్పి వస్తుందట. ఫలితంగా మూత్రంలోకి రక్తం రావడం, శరీరంలోని అవయవాలకు ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ సరిగ్గా అందించలేక శ్వాసకోస ఇబ్బందులు ఏర్పడడం, ఆక్సిజన్‌ అందక శరీరంలోని ఏదైన అవయం దెబ్బతింటుందని, కీళ్ల నొప్పులు వస్తాయని తెలిపారు. బీపీ కూడా తీవ్రంగా పడిపోతుందని, కొన్ని సందర్భాల్లో మత్యువు కూడా సంభవిస్తుందని డాక్టర్‌ రాచెల్‌ వివరించారు. దీన్ని నిరోధించేందుకు ఇప్పటి వరకు సరైన మందులేదని, మానవ శరీరంలో ప్రవేశించిన ఈ వైరస్‌ తన సైకిల్‌ను పూర్తి చేసుకొని బయటకు వెళ్లి పోయే వరకు శరీరంలోని ఏ అవయవం దెబ్బతినకుండా రక్షించుకోవడం, వాటి పరిరక్షణకు అవసరమైన మందులు తీసుకోవడం మంచిదని ఆయన చెప్పారు.
భారత్‌లో ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల డెంగ్యూ కేసులు నమోదయినాయని వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో గెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో 2005లో అత్యధికంగా 15 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆ వర్గాలు  పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు