అమానుషం.. పేదల వ్యతిరేకం

10 Mar, 2015 02:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే జరిగింది. భూసేకరణ బిల్లును చట్టరూపంలోకి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి గండికొట్టేందుకు సిద్ధపడ్డాయి. ఈ బిల్లు అమానుషమైనదని, పేదలకు వ్యతిరేకమైందనీ నినదించాయి. కార్పొరేట్లకు అప్పనంగా భూమిని అప్పగించేందుకు మోదీ సర్కారు కుట్రపన్నుతోందని నిరసించాయి. సోమవారం ‘భూసేకరణ, పునరావాస చట్టంలో సముచిత పరిహారం, పారదర్శకత-2015’ సవరణ బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ లోక్‌సభ ముందుంచారు. భూసేకరణ బిల్లులోని 2, 3ఏ సెక్షన్‌లపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెప్పాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలో రైతులకు రక్షణగా ఉన్న సామాజిక ప్రభావ అంచనా(ఎస్‌ఐఏ) అధ్యయనాన్ని ఈ సెక్షన్లు కాలరాస్తున్నాయని సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆరోపించాయి.

దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు బిల్లులో కనీసం ఏడు సవరణలకు సూచనప్రాయంగా సంసిద్ధత వ్యక్తంచేశారు. పారిశ్రామిక కారిడార్ల కోసం భూమిని తగ్గించటం, సామాజిక ప్రభావ అంచనా మినహాయింపు నుంచి మౌలిక సౌకర్యాలు, పీపీపీ ప్రాజెక్టులను తొలగించటం వీటిలో ఉన్నాయి. నేడు జరగ నున్న ఓటింగ్ సందర్భంలో ప్రభుత్వం ఈ సవరణలను ప్రతిపాదించే అవకాశం ఉంది.  2013భూసేకరణ చట్టంలో సవరణల ఆర్డినెన్సు బిల్లును ఫిబ్రవరి 24న ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బిల్లుతో పాటు దీన్ని తిరస్కరిస్తూ ఎన్డీఏ మిత్రపక్షం స్వాభిమాని పక్ష తీసుకువచ్చిన తీర్మానాన్ని కూడా సభ చర్చకు చేపట్టింది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినా.. రాజ్యసభలో దాన్ని అడ్డుకోవటానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌లు విపక్ష పార్టీల నేతలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
 
ఆహార దిగుమతి దేశంగా మారుస్తారా?
భూసేకరణ చట్టాన్ని ప్రస్తుతం ఆర్డినెన్సులో ఉన్న రూపంలో ఆమోదిస్తే ఈ దేశంలో ప్రజలకు ఆహార భద్రత అన్నది లేకుండా పోతుందని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. బహుళ పంటల భూమిని ప్రైవేటు వ్యక్తులు కొల్లగొట్టుకుపోతారన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే రైతులు ఈ దేశం నుంచి ఇక ఆశించేదేమీ మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రైతుల నుంచి భూమిని లాక్కోకుండా, వారి దగ్గరి నుంచి లీజుకు తీసుకోవటం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలని అరవింద్ సావంత్ (శివసేన) సూచించారు.  కొందరు సభ్యులు బిల్లును పార్లమెంటు స్థాయీసంఘానికి నివేదించాలని కోరారు. బిల్లుపై తమ వైఖరిని పార్టీ చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే నిర్ణయిస్తారని సేన నేత సంజయ్ రౌత్ తెలిపారు.

వ్యతిరేకంగా ఓటేస్తాం..: కాంగ్రెస్
సవరణలను వాపసు తీసుకోకపోతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని కాంగ్రెస్  నిర్ణయించింది. కీలకమైన బిల్లుల ఆమోదానికి  వీలుగా బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ వారం రోజులూ తప్పనిసరిగా  ఉభయసభలకు హాజరు కావాలంది.
 
తీసుకురానున్న సవరణలు...
భూసేకరణ చట్టంలో విపక్షాల డిమాండ్ మేరకు వీలైనన్ని సవరణలకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు లోక్‌సభలో చెప్పారు. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో మధ్యలో జోక్యం చేసుకున్న వెంకయ్యనాయుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా బిల్లును ఆమోదించాలని సభను కోరారు. సభ్యులు ప్రతిపాదించిన మొత్తం 52 సవరణలను పరిశీలించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే మంగళవారం ఓటింగ్ సమయానికి 7 సవరణలతో ప్రభుత్వం ముందుకు రానుందని సమాచారం. వీటికి సంబంధించి వెంకయ్య సోమవారం సభలోనే సంకేతాలిచ్చారు. ప్రభుత్వం తీసుకురానున్న సవరణలు ఇవీ...

     పారిశ్రామిక కారిడార్లకు భూమిని తగ్గించటం

     బంజరు భూముల కోసం ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు . ఆ భూములను పారిశ్రామిక ప్రాజెక్టులకు వినియోగించటం.

     నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలన్న నిబంధన చేర్పు.

     పునరావాస సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ.

     రైల్వే ట్రాకులు, హైవేలకు రెండువైపులా భూసేకరణను పరిమితం చేయటం.

     భూసేకరణపై హైకోర్టు అప్పీలుకు వెళ్లకుండా, ముందుగా జిల్లా అధికారులకు అప్పీలు చేసే అవకాశాన్ని కల్పించటం

సామాజిక ప్రభావ అంచనా(ఎస్‌ఐఏ) అధ్యయనం మినహాయింపు, జరీబు భూముల సేకరణకు అనుమతికి అవకాశం కల్పించిన 5 రంగాల నుంచి సామాజిక మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు, పీపీపీ ప్రాజెక్టులను తొలగించటం

 అయితే ఏదైనా ప్రాజెక్టు అయిదేళ్లలో పూర్తికాకపోతే భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిబంధనను తొలగించటాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఈ నిబంధనను ఉంచినట్లయితే భారతదేశం పూర్తికాని ప్రాజెక్టుల దేశంగా మిగిలిపోతుందని  చెప్పారు. ఏప్రిల్ 5 నాటికల్లా ఆర్డినెన్సు చట్టరూపం దాల్చాల్సి ఉందని, లోక్‌సభ మార్చి 20 వరకే జరుగుతుందని ఈ లోపు బిల్లు ఆమోదం పొందాలని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు