స్థిరంగా అల్పపీడనం

17 May, 2016 02:45 IST|Sakshi
స్థిరంగా అల్పపీడనం

- రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం
- తమిళనాడు తీర ప్రాంతాల్లో కురుస్తున్న వానలు


సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్:
నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంకకు ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద ఏర్పడిన బలమైన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 3.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. భారత వాతావరణ విభాగం ముందుగా అంచనా వేసిన ప్రకారం.. ఈ అల్పపీడనం సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడి మంగళవారం ఉదయానికి తమిళనాడులోని నాగపట్నం వద్ద తీరాన్ని దాటాల్సి ఉంది. కానీ ఇంకా బలమైన అల్పపీడనంగానే కొనసాగుతోంది. వాయుగుండం ఏర్పడలేదు.

తాజా అంచనాల ప్రకారం ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తూ బుధవారం నాటికి ఇది వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.

ముందుగానే రుతుపవనాలు..?
వాయుగుండం ఆలస్యంగా ఏర్పడడం వల్ల నైరుతి రుతుపవనాలు బలం పుంజుకుని ఒకింత ముందుగా కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు విదర్భ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అటు అల్పపీడనం, ఇటు ద్రోణి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలలో పలుచోట్ల రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణ, ఉత్తర కోస్తాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈదురుగాలుల ముప్పు
మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని... దీనివల్ల తెలంగాణలో అన్ని జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని, చెట్లు, స్తంభాలు పడిపోవచ్చని, పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. ఇక తెలంగాణలో సోమవారం రామగుండంలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 38.1 డిగ్రీలు గరిష్ట, 26.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

10 శాతం ఎక్కువగా వానలు: స్కైమెట్
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 29వ తేదీనే కేరళ తీరాన్ని తాకుతాయని... దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ మోతాదులో వర్షాలు పడతాయని వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు కంటే ఐదు శాతం అధికంగా వానలు కురుస్తాయని, మరో ఐదు శాతం వరకూ అదనంగా కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 17వ తేదీకల్లా అండమాన్ సముద్రాన్ని చేరుకునే రుతుపవనాలు... తరువాత 12 రోజులకు కేరళ తీరాన్ని తాకుతాయని స్కైమెట్ వాతావరణ నిపుణుడు పల్వట్ మహేశ్ తెలిపారు.

రెండేళ్ల వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో ప్రభావం వచ్చే నెలకు పూర్తిగా తగ్గిపోతుందని, దీంతో ఈ ఏడాది రుతుపవనాలకు మార్గం సుగమమైందని చెప్పారు. రుతుపవనాలు జూన్ ఆరో తేదీకల్లా తెలంగాణకు, 12వ తేదీకి ముంబైకి చేరుతాయని... జూలై పన్నెండు నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశముందని వివరించారు. జూన్‌లో సాధారణం లేదా కొద్దిగా అదనంగా వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. జూలై, ఆగస్టుల్లో మాత్రం 110 శాతం మేర వానలు పడతాయని వెల్లడించారు.
 
సోమవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు
 ప్రాంతం          ఉష్ణోగ్రత
 రామగుండం    44.0
 ఆదిలాబాద్    43.8
 నిజామాబాద్    42.9
 హైదరాబాద్    38.1

మరిన్ని వార్తలు