మార్చి నెలలోనే అల్పపీడనం

16 Mar, 2018 21:00 IST|Sakshi
అరేబియా సముద్రంలో అల్పపీడనం కేంద్రీకృతమైన ప్రదేశం

అరేబియా సముద్రంలో అరుదైన వాతావరణం

125 ఏళ్లలో ఇదే తొలిసారి

సాక్షి, హైదరాబాద్‌ : ఎండలు ఠారెత్తిస్తున్నప్పుడు, ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకున్నప్పుడు అల్పపీడనాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడం సాధారణమైన విషయం. కానీ ఈ ఏడాది వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అరేబియా సముద్రం మీదుగా అరుదైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.

మార్చి నెలలోనే, ఇంకా అంతగా ఎండలు ముదరకుండానే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ముంబైలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. సర్వసాధారణంగా అరేబియా సముద్రంలో ఏప్రిల్, మే నెలల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.

కానీ ఈ సారి మార్చిలోనే ఈ పరిస్థితి రావడం అత్యంత అరుదైనదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 125 సంవత్సరాల్లో ఈ తరహా వాతావరణాన్ని చూడడం ఇదే తొలిసారని అంటున్నారు. 1891వ సంవత్సరం నుంచి అరేబియా సముద్రంలో వాతావరణానికి సంబంధించిన రికార్డుల్ని పరిశీలిస్తే మార్చి నెలలోనే అల్పపీడనం ఏర్పడడం ఇదే మొదటిసారని వారు తేల్చి చెప్పారు.

దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనాలున్నాయి. కొంకణ్, సెంట్రల్‌ మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగావీస్తున్న బలమైన గాలులు లక్షద్వీప్, కేరళను చుట్టుముట్టాయి. గంటకి 55 కి.మీ.వేగంతో గాలులు వీస్తున్నాయి.

మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముంబై, పుణె, నాసిక్‌లలో ఇప్పటికే మబ్బుపట్టిన వాతావరణం, చిరుజల్లులు ప్రజల్ని సేద తీరుస్తున్నాయి. కానీ ఇప్పటికే నిండా అప్పుల్లో మునిగిపోయిన రైతన్నలకు ఈ వాతావరణ పరిస్థితులు దడపుట్టిస్తున్నాయి. రబీ పంటల సమయంలో వాతావరణంలో ఇలాంటి మార్పులు, అకాలవర్షాల వల్ల రైతులకు ఎంత నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.

ఎందుకీ పరిస్థితి వచ్చింది ?
హిందూ మహాసముద్రంలో భూమధ్యరేఖకు సమీపంలో మార్చి 10న ఏర్పడిన అతి తక్కువ స్థాయి అల్పపీడనం అరేబియా సముద్రంవైపునకు వచ్చి అల్పపీడనంగా మారింది. అది గంటకు 20 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ లక్షద్వీప్‌ వద్ద బలహీనపడింది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్నప్పుడు సముద్ర ఉపరితలం వేడెక్కి, సముద్ర జలాలు ఆవిరిగా మారి అల్పపీడనాలు ఏర్పడుతూ ఉంటాయి.

గత దశాబ్దకాలంలో భూమధ్య రేఖకు సమీపంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి హిందూమహా సముద్రం ఉపరితల జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కిపోవడం మొదలైంది. దాని ప్రభావం అరేబియా సముద్రం వైపు మళ్లిందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితుల కారణంగా కాలం కాని కాలంలో అల్పపీడనాలు, తుఫాన్‌లు ఏర్పడుతున్నాయి.

సాధారణంగా బంగాళఖాతంతో పోల్చి చూస్తే అరేబియా సముద్రంలో అల్పపీడనాలు తక్కువగానే ఏర్పడతాయి. కానీ గత నాలుగేళ్లుగా అరేబియా సముద్రంలో అల్పపీడనాలు, తుఫాన్‌లు ఎక్కువైపోతున్నాయి.  ఈ సముద్ర తీర ప్రాంతంలో మానవ కార్యకలాపాలు పెరిగిపోవడం, పారిశ్రామిక వాడలు ఎక్కువైపోవడం వల్ల కూడా వాతావరణంలో అనూహ్యమార్పులు చోటు చేసుకుంటున్నాయని తాజాసర్వేలు వెల్లడిస్తున్నాయి.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

మరిన్ని వార్తలు