ఆ కుటుంబం ఆత్మహత్యకు కారణం అదే..

6 Dec, 2019 11:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో కలకలం సృష్టించిన కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు తేల్చారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిన ఒత్తిడి కారణంగానే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. వ్యాపారంలో నష్టాలు రావడంతోనే వారంత తనువు చాలించారని వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గుల్షన్‌ వాసుదేవ ఉత్తర ఢిల్లీలోని గాంధీనగర్‌లో గార్మెంట్‌ బిజినెస్‌ నడిపిస్తున్నాడు. గత ఐదేళ్లుగా వ్యాపారంలో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాడు. దీంతో అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబ పోషణ కూడా భారం కాసాగింది. ఈక్రమంలోనే కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.

గుల్షర్‌ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మిత్రుడు అరోరాకు టెక్స్ట్‌ మెసేజ్‌ చేశాడు. అనంతరం కాసేపటికి వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. శాశ్వతంగా నిద్రపుచ్చిన తన పిల్లలను, గోడపై రాసిన సూసైడ్‌ నోట్‌ను చూపించాడు. అందులో వారి చావుకు రాకేశ్‌ వర్మ కారణమంటూ గోడపై రాతలు కనిపించాయి. కాగా గుల్షన్‌ అతని బంధువు రాకేశ్‌ వర్మకు రూ.2 కోట్లు అ‍ప్పుగా ఇచ్చాడు. కానీ అతను ఇచ్చిన చెక్‌లు బౌన్స్‌ అయ్యాయి. ఆ తర్వాత అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేయలేకపోయాడు. దీంతో 2015లో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదు చేశారు.

కుటుంబం ఆత్మహత్య
ఏదారి కనిపించక మరణమే శరణ్యమని భావించిన గుల్షన్‌ పిల్లలను చంపేసి, భార్యతో కలిసి ఎనిమిదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లతో పాటు అతని ఆఫీసు ఉద్యోగి సంజన కూడా ఆత్మహత్యకు యత్నించటం విచారకరం. ఆత్మహత్యకు యత్నించి తీవ్రగాయాలపాలై చికిత్స తీసుకుంటున్న సంజనను ముందుగా గుల్షన్‌ రెండో భార్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, విచారణలో ఆమెను ఫ్యాక‍్టరీలో పనిచేసే ఉద్యోగిగా తేల్చారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు