డేరా విధ్వంసకాండ

27 Aug, 2017 02:27 IST|Sakshi
డేరా విధ్వంసకాండ
- తగలబడ్డ హరియాణా, పంజాబ్‌
36 మంది మృతి.. 269 మందికి గాయాలు
 
పంచకుల/చండీగఢ్‌/న్యూఢిల్లీ: హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలు భగ్గుమన్నాయి. డేరా సచ్చా సౌధా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను రేప్‌కేసులో శుక్రవారం సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించటంతో ఈ రెండు రాష్ట్రాలతోపాటు ఢిల్లీలోనూ ఆయన అభిమానులు బీభత్సం సృష్టించారు. వీరి విధ్వంసకాండతో రెండు రాష్ట్రాల్లో 36 మంది చనిపోగా.. 269 మంది గాయపడ్డారు. డేరా అభిమానులు పెట్రోలు బాంబులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. పంచకులలో వీరి ఉన్మాదానికి కనబడ్డ వస్తువల్లా అగ్నికి ఆహుతైంది. రైలు, బస్సు, కారు, బైక్‌ అనే తేడా లేకుండా ప్రతి వాహనాన్నీ అన్యాయంగా తగలబెట్టేశారు.

భవనాలనూ ఆందోళనకారులు వదల్లేదు. పంచకులలో ఎటుచూసినా వాహనాలను తగులబెట్టిన అగ్నికీలలే ఎగిసిపడ్డాయి. తమ ఉన్మాదాన్ని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. మొత్తంగా హరియాణాలోని పంచకుల, సిర్సాలతోపాటు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ అల్లర్లలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ శివార్లలో డేరా ఉన్మాదులు ఓ రైలు బోగీని తగులబెట్టారు. రాజస్తాన్‌లోనూ ప్రభుత్వ వాహనాలు, శ్రీ గంగానగర్‌ జిల్లాలో లేబర్‌ కోర్టు సహా రెండు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుబెట్టారు. 
 
డేరాల ప్రాబల్యమున్నచోట.. 
పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలోనూ 32 దాడి కేసులు నమోదయ్యాయి. డేరా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మాన్సా, బతిండా, ఫిరోజ్‌పూర్, పటియాలా, బర్నాలా, ఫరీద్‌కోట్‌ ప్రాంతాలతోపాటుగా హరియాణాలోని పంచకుల, సిర్సాతోపాటు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ (144 సెక్షన్‌) విధించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. పంజాబ్‌లోని మాన్సాలో ఆదాయపన్ను శాఖ భవనాన్ని తగులబెట్టగా.. మిగిలిన చోట్ల రైళ్లు, మోటార్‌ సైకిళ్లు, కార్లు, భవనాలకు నిప్పంటించారు. మోగా, ఫిరోజ్‌పూర్‌ మధ్యనున్న దాగ్రు రైల్వే స్టేషన్‌ను తగులబెట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పంచకులలో విధ్వంసం ఎక్కువగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసంతోపాటుగా మూడు టీవీచానెళ్ల ఓబీ వ్యాన్లను తగులబెట్టారు. రెండింటిని ధ్వంసం చేశారు. ఓ చానెల్‌ వాహనంపై దాడిచేయటంతో కెమెరామెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపినా విధ్వంసం ఆగలేదు. 
 
డేరా కార్యాలయాల్లో సోదాలు 
కోర్టు ఆదేశాలతో సిర్సాతోపాటుగా హరియాణాలోని డేరా ప్రధాన కార్యాలయంతోపాటుగా 30 వేర్వేరు కేంద్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడున్న అనుచరులు, భక్తులను పంపించేశారు. ఈ సోదాల్లో ఓ ఏకే 47, ఆరు పిస్టళ్లు, రెండు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 3వేల లాఠీలు, హాకీ స్టిక్స్, పెద్ద సంఖ్యలో డీజిల్, పెట్రోల్‌ బాంబులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేరా అభిమానులపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. డేరాకు సంబంధించిన 24 వాహనాలను సీజ్‌ చేసి వాటి నుంచి ఐదు పిస్టళ్లు, 79 రౌండ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి హరియాణాలో 552 మందిని అరెస్టు చేసినట్లు హరియాణా డీజీపీ బీఎస్‌ సంధు వెల్లడించారు. ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, డేరా చీఫ్‌పై అభియోగాలు నమోదైన కేసులో దోషులకు సాధారణంగా ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. పలు కేసుల్లో ఇది జీవితఖైదుగా కూడా మారే అవకాశం ఉంది. 
 
అసలేం జరిగింది? 
2002 నాటి అత్యాచారం కేసు విచారణ సందర్భంగా డేరా చీఫ్‌ గుర్మీత్‌ను సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు. దీంతో వేల మంది డేరా అభిమానులు, కార్యకర్తలు కోర్టుముందు గుమిగూడారు. తమకు వ్యతిరేకంగా తీర్పు వెలువడటంతో.. అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ముందస్తుగానే అల్లర్లపై ప్రణాళికతో సిద్ధమై వచ్చిన ఆందోళనకారులు.. పెట్రోల్‌ బాంబులతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. సీబీఐ కోర్టు ఉన్న హరియాణాలోని పంచకుల కేంద్రంగానే ఈ గొడవలు ప్రారంభమైనా ఈ సమాచారం దావానలంలా వ్యాపించింది.  
 
నిఘావర్గాల హెచ్చరికలు బేఖాతరు! 
డేరా చీఫ్‌ అభిమానుల విధ్వంసపు ఆలోచనల సంగతిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ముందుగానే సమాచారం అందించింది. మూడేళ్ల క్రితం హరియాణాలోని హిస్సార్‌ జిల్లాలో ఇదేవిధంగా అన్యాయాలకు పాల్పడిన బాబా రాంపాల్‌ను అరెస్టు చేసే సందర్భంలో అతని అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన విషయం సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ గుర్మీత్‌పై కోర్టు తీర్పు ఆధారంగా విధ్వంసానికి అతని అభిమానులు ప్రయత్నించే అవకాశం ఉందని హరియాణా, పంజాబ్‌ ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్‌ సూచించింది. అయితే సూచనలను ఇరు ప్రభుత్వాలూ పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతోంది. ఈ హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు చేపట్టి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. హింస మొదలవుతూనే.. పెట్రోల్‌ బాంబులతో దాడికి తెగబడ్డారంటే ఎంత పకడ్బందీగా దాడులకు వ్యూహరచన జరిగిందో అర్ధమవుతుంది. 
 
వీఐపీ సౌకర్యాల్లేవు! 
కోర్టు తీర్పు నేపథ్యంలో డేరా చీఫ్‌ రాంరహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌కు గతంలో కేటాయించిన ‘జడ్‌ ప్లస్‌’ భద్రతను హరియాణా ప్రభుత్వం వెనక్కుతీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎస్‌ దేశీ వెల్లడించారు. రోహ్‌తక్‌ జిల్లా సునరియా జైల్లో డేరా చీఫ్‌కు వీఐపీ వసతులు కల్పిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కాగా, జైలు చుట్టుపక్కల భారీ సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించారు. వదంతులను నమ్మొద్దని, సంయమనం పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు సూచించారు. డేరా అభిమానుల విధ్వంసంతో పంజాబ్‌–హరియాణాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. జమ్మూ శివార్లలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లో ఈ మార్గంలో వెళ్లే రైళ్లు, బస్సులను ఆపేశారు. దీంతో వైష్ణోదేవి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పంజాబ్, హరియాణాల్లో జరిగిన విధ్వంసకాండను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖండించారు. 
 
పంచకుల డీసీపీ సస్పెన్షన్‌ 
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటంతో విఫలమయ్యారంటూ వివాదానికి కేంద్రబిందువైన పంచకుల డీసీపీ అశోక్‌ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. జిల్లా వ్యాప్తంగా, కోర్టు సమీపంలో భారీగా జనాలు గుమిగూడుతున్నా వారిని చెదరగొట్టడంలో విఫలమయ్యారని హరియాణా హోం శాఖ అదనపు కార్యదర్శి రాం నివాస్‌ పేర్కొన్నారు. హరియాణా, పంజాబ్‌లలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహర్షి, పారామిలటరీ బలగాల చీఫ్‌లతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. పరిస్థితి అదుపులో ఉందని హరియాణా, పంజాబ్‌ డీజీపీల నుంచి సమాచారం అందినట్లు సమావేశం అనంతరం రాజీవ్‌ మెహర్షి వెల్లడించారు. హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లలో 20వేలకు పైగా పారామిలటరీ బలగాలను మోహరించారు. 
 
రేప్‌ కేసులో దోషి
డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాంరహీమ్‌పై 2002 నాటి ఓ అత్యాచారం కేసులో సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. దీనిపై శుక్రవారం విచారించిన పంచకుల సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగ్‌దీప్‌ సింగ్‌.. డేరాచీఫ్‌ను దోషిగా తేల్చారు. గుర్మీత్‌ అరెస్టుకు ఆదేశాలు జారీచేయటంతోపాటుగా సోమవారం ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు. తనను దోషిగా తేల్చటంతో రాంరహీమ్‌ ఆశ్చర్యానికి గురైనట్లు ఆయన తరపు న్యాయ వాది తెలిపారు. అరెస్టు ఆదేశాలు వెలువడగానే.. డేరాచీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు రాంరహీమ్‌ వచ్చిన వాహన శ్రేణి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఆదేశించారు. అనంతరం ప్రత్యేక హెలికా>ప్టర్‌లో రోహ్‌తక్‌ జైలుకు తరలించారు. కాగా, సీబీఐ కోర్టు న్యాయమూర్తి సోమవారం సునారియా జైలుకెళ్లి గుర్మీత్‌కు విధించాల్సిన శిక్షలను ఖరారు చేయనున్నారు.  
 
ఖట్టర్‌ను తొలగించబోం: బీజేపీ 
డేరా ఉన్మాదకాండ నేపథ్యంలో హరియాణా సీఎం ఖట్టర్‌ను తొలగించాలన్న విపక్షాల డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చింది. ‘హరియాణా, పంజాబ్‌లలో జరిగిన ఘటనలు దురదృష్టకరం. అయినా విధ్వంసం మొదలైన మూడుగంటల్లోనే ప్రభుత్వం పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఇది సీఎం ఖట్టర్‌ వైఫల్యమేమీ కాదు. ఆయన్ను తొలగించాలన్న ఆలోచనేదీ లేదు’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి, హరియాణా బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌ అనిల్‌ జైన్‌ స్పష్టం చేశారు. డేరా ఆందోళనకారుల విధ్వంసకాండతో జరిగిన నష్టాన్ని ఆ సంస్థ ఆస్తుల నుంచే రికవరీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
>
మరిన్ని వార్తలు