‘కొలీజియం విఫలం కాలేదు’

12 Aug, 2014 02:17 IST|Sakshi
‘కొలీజియం విఫలం కాలేదు’

అది విఫలమైతే మేమూ విఫలమైనట్లే అని సీజేఐ తీవ్ర వ్యాఖ్య
కొలీజియం వ్యవస్థను గట్టిగా సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
ఒకరిద్దరిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా వ్యవస్థను తప్పుపట్టొద్దు

 
న్యూఢిల్లీ: ఒకవైపు కొలీజియం వ్యవస్థను రద్దు చేసే దిశగా ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తుండగా.. మరోవైపు కొలీజియం విధానాన్ని గట్టిగా సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఆర్‌ఎం లోధా.. ‘న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా తప్పుదారి పట్టించే ప్రచారం సాగుతోంది. దానివల్ల ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలుతుంది. న్యాయవ్యవస్థపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు ఇప్పటికే చాలా  ప్రయత్నాలు జరిగాయి. మా తపనంతా వ్యవస్థ స్వచ్ఛతపైనే. అవాస్తవాలను వ్యాపింపజేసేందుకు ప్రయత్నించకండి’ అని తెగేసి చెప్పారు. కొలీజియం వ్యవస్థపై సాగుతున్న ప్రచారాన్ని అన్యాయమైనదిగా జస్టిస్ లోధా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  
 ‘కొలీజియం ద్వారా జడ్జీలైన మొదటి బ్యాచ్‌లో నేనొకడిని. నాతో కూర్చున్న జస్టిస్ నారిమన్ అదే వ్యవస్థ ద్వారా ఇటీవలే సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యారు. కొలీజియం వ్యవస్థ విఫలమైందని మీరు భావిస్తే.. మేం కూడా విఫలమైనట్లే. మొత్తంగా న్యాయవ్యవస్థే విఫలమైనట్లు అవుతుంది’ అని జస్టిస్ లోధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఒక వ్యవస్థగా కొలీజియానికి కొన్ని పరిమితులున్నాయి. జడ్జీలు కూడా ఈ సమాజం నుంచే వచ్చారు కదా! ఒకరిద్దరు జడ్జీలపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన మొత్తం వ్యవస్థపైనే తప్పుడు ప్రచారం కొనసాగించడం అన్యాయం’ అన్నారు. కొలీజియంను రద్దు చేసి ఆ స్థానంలో న్యాయమూర్తుల నియామక కమిషన్‌ను ఏర్పాటు చేసే దిశగా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఇంకో కొలీజియం ఉందా?

కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ కేఎల్ మంజునాథ్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించిందని, ఆ సిఫారసును విధిగా పాటించాల్సిన అవసరం లేదంటూ ఆదేశాలివ్వాలని.. దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘మంజునాథ్‌కు పదోన్నతి కల్పిస్తున్నామని మీకెవరు చెప్పారు? సీజేఐగా ఒక కొలీజియానికి నేను నేతృత్వం వహిస్తున్నాను. మరో కొలీజియం ఉందేమో నాకు తెలియదు’ అని లోధా ఆగ్రహంగా అన్నారు. జస్టిస్ మంజునాథ్ పేరును కొలీజియం ఎన్నడూ సిఫారసు చేయలేదని తేల్చి చెప్పారు. దాంతో దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి చూపిస్తూ.. అవాస్తవాలను ప్రచురించిన వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ‘మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మమ్మల్ని పనిచేయమంటారా?’అని ధర్మాసనం ప్రశ్నించింది.  ‘మీడియాలోనూ తప్పుడు సమాచారం వస్తోంది. జడ్జిని బదిలీ చేయడం వేరు.. పదోన్నతి కల్పించడం వేరు’ అని పేర్కొంది.

జస్టిస్ మంజునాథ్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసిందని, అయితే, బదిలీ తరువాత జస్టిస్ మంజునాథే సీనియర్ న్యాయమూర్తి అవుతారు కాబట్టి, సీనియారిటీ ప్రకారం ఆయనే ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముందని అధికార వర్గాలు వివరించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి  సిఫారసులు చేస్తుందనే విషయం తెలిసిందే.
 
 కొలీజియం ఉద్దేశం నెరవేరలేదు


కోల్‌కతా: కొలీజియం వ్యవస్థను ఏర్పాటుచేసిన ఉద్దేశం నెరవేరలేదని, అందువల్ల ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ సోమవారం వ్యాఖ్యానించారు. ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థ సరిగా పనిచేయడం లేదన్నారు. ‘జడ్జీల నియామకంలో కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రాధాన్యత లేకుండా చేయడంలో కొలీజియం విజయం సాధించింది. కానీ రాజ్యాంగం ఉద్దేశం అది కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ ప్రక్రియ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందనే నమ్మకం పెరిగేలా కొత్తగా ప్రవేశపెట్టిన జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ పని చేయాలని ఆయన ఆకాంక్షించారు.
 

మరిన్ని వార్తలు