నా కొడుకు సీఎం కావాలని కోరుకోలేదు : దేవేగౌడ

21 Jun, 2019 13:32 IST|Sakshi

బెంగళూరు : త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. తొలుత కాంగ్రెస్‌ తమకు ఐదేళ్ల పాటు పూర్తి మద్దతిస్తానని చెప్పిందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకుల పద్దతి చూస్తూంటే.. త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. పేరుకే కుమారస్వామి సీఎం అని.. పెత్తనం మొత్తం కాంగ్రెస్‌ చేతిలోనే ఉందన్నారు. కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయాలన్నింటిని జేడీఎస్‌ ఒప్పుకుందని తెలిపారు. వీటన్నింటిని కర్ణాటక ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

సంకీర్ణ కూటమిలో ఉండే కష్టాలేంటో తనకు బాగా తెలుసన్నారు దేవేగౌడ. అందుకే కూటమిలో భాగంగా కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలని తాను కోరుకోలేదన్నారు. తన కుమారుడి బదులు మల్లికార్జున ఖర్గేను సీఎంగా చేయమని రాహుల్‌ గాంధీని కోరానని తెలిపారు. అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. అంతేకాక కాంగ్రెస్‌ ఒత్తిడి వల్లే కూటమి ఏర్పాటుకు ఒప్పుకున్నాను అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకు బలహీన పడుతుందని.. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఆ పార్టీ ఓటమి పాలయ్యిందన్నారు దేవేగౌడ.

మరిన్ని వార్తలు