వెనుకబడిన జిల్లాలకు బాసటగా..

11 Mar, 2018 02:12 IST|Sakshi
పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో మాట్లాడుతున్న మోదీ. చిత్రంలో సుమిత్రా, తంబిదురై తదితరులు

వాటి అభివృద్ధికి పాటుపడి సామాజిక న్యాయం దిశగా అడుగులు వేద్దాం

పార్లమెంటు, అసెంబ్లీల సభ్యుల సదస్సులో ప్రధాని మోదీ  

న్యూఢిల్లీ: అత్యంత వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి పాటుపడటం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయడమేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ క్రమంలో దేశంలోని 115 వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం చట్ట సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలే సర్వస్వంగా భావించే ఒకప్పటి పరిస్థితి  ఇప్పుడు లేదని, ప్రజలకు సాయపడేందుకు వచ్చామా? లేదా అన్నదే  ముఖ్యమన్నారు. శనివారం పార్లమెంటు సెంట్రల్‌ హాలులో నిర్వహించిన ‘వియ్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌’ సదస్సులో కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన శాసన సభ్యుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

‘పిల్లలంతా స్కూళ్లకు వెళ్లినప్పుడు అన్ని ఇళ్లకు విద్యుత్‌ సరఫరా ఉన్నపుడు మాత్రమే సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసినట్లుగా భావించాలి. అభివృద్ధిలో వెనకబాటుకు నిధులు లేదా వనరుల కొరతో కారణం కాదు.. పాలనా లోపాల వల్లే ఆ పరిస్థితి కొనసాగుతోంది. అభివృద్ధికి కావాల్సినవి సుపరిపాలన, సమర్థవంతంగా పథకాల అమలు, అంకితభావంతో కార్యక్రమాల్ని నిర్వహించడమే’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఒక ఇంట్లో లేక ఊరిలో విద్యుత్‌ ఉండి పక్కింట్లో, గ్రామంలో లేకపోతే వారూ కరెంటు పొందేలా చూడాలని సామాజిక న్యాయం మనకు బోధిస్తుంది’ అని చెప్పారు.

‘మీరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా... ప్రజలకు సాయం చేసేందుకు వచ్చారా? లేదా? అన్నదే అసలు సంగతి. ఎన్ని ఆందోళనలు చేశారు... ఎన్ని సార్లు మీరు జైలు కెళ్లారు? అనేవి 20 ఏళ్లక్రితం ప్రాముఖ్యంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది’ అని చెప్పారు. తమ ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యాల్ని పూర్తి చేసే దిశగా చట్టసభ్యులు పనిచేయాలని మోదీ కోరారు. మళ్లీ మళ్లీ చట్టసభలకు ఎన్నికయ్యే వారిని రాజకీయాలకు అతీతంగా ఓటర్లు చూస్తారని చెప్పారు.  

ఏడాది కష్టపడితే మెరుగైన ఫలితాలు
దేశంలోని వెనకబడ్డ 115 జిల్లాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసినట్లని ప్రధాని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చట్టసభ్యులు నిజాయతీగా ఒక ఏడాది పనిచేస్తే..  గొప్ప మార్పు సాధించవచ్చని, మానవ అభివృద్ధి  సూచీలో భారత్‌ పైకి ఎగబాకుతుందని చెప్పారు. సులువుగా ఫలితాలు రాబట్టేందుకే ప్రభుత్వాలు మొగ్గుచూపుతాయని, అందుకే అభివృద్ధి చెందిన జిల్లాల్లో మరింత మెరుగైన ప్రదర్శన ఉంటే.. వెనకబడిన జిల్లాలు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వాటిని వెనకబడ్డ జిల్లాలుగా కాకుండా అభివృద్ధిని ఆకాంక్షించే జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ 115 జిల్లాలకు కలెక్టర్లుగా యువ ఐఏఎస్‌లను నియమించాలని మోదీ కోరారు. ‘ఆ జిల్లాల అధికారులతో సమావేశమైనప్పుడు.. వారిలో 80 శాతం 40 ఏళ్లు పైబడ్డ వారే ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. మామూలుగా జిల్లా కలెక్టర్‌ వయసు 27–30 మధ్యలో ఉంటుంది’ అని అన్నారు.

సుపరిపాలనతోనే అభివృద్ధి
అందుబాటులో ఉన్న వనరులు, శ్రమ శక్తిని వాడుకుని అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని మోదీ అన్నారు. సుపరిపాలన ప్రాముఖ్యత గురించి చెపుతూ.. పేద ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం సరిగా అమలు కాలేదని, ధనిక ప్రాంతాల్లో సమర్థంగా అమలైందని.. సుపరిపాలన వల్లే అది సాధ్యమైనట్లు గుర్తించానని ప్రధాని చెప్పారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులోనే జవహర్‌ లాల్‌ నెహ్రూ, బీఆర్‌ అంబేడ్కర్, సర్దార్‌ పటేల్‌ తదితరులు రాజ్యాంగాన్ని సిద్ధం చేశారన్న విషయాన్ని మోదీ గుర్తు చేసుకుంటూ.. అదే హాలులో చట్ట సభ్యులు దేశాభివృద్ధి కోసం సంఘీభావంగా హాజరుకావడాన్ని ఆయన ప్రశంసించారు. వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు అభివృద్ధి అంశంపై కలిసి కూర్చోవడం రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి సజీవ నిదర్శనమని పేర్కొన్నారు. చట్ట సభ్యులు రాష్ట్ర యంత్రాగానికి చేయూతగా ఉండాలని ఆకాంక్షించారు.
 

మరిన్ని వార్తలు