పౌర విమానాల దారి మళ్లింపు : డీజీసీఏ

22 Jun, 2019 20:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో భారత్‌కు చెందిన పౌర విమానాల దారి మళ్లించనున్నట్లు డీజీసీఏ( డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా కన్నెర్రజేయడంతో మధ్య ప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఇరాన్‌ గగనతలం నుంచి ప్రయాణించే విమాన మార్గాలను మారుస్తున్నట్లు తెలిపింది. వీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. కాగా హొర్ముజ్‌ జలసంధి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెళ్లే పౌర/వాణిజ్య విమానాలు కూడా పొరపాటున కూల్చివేతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్రిటిష్‌ ఎయిర్‌వేస్, ఇతిహాద్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్, మలేసియా ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, కేఎల్‌ఎం సహా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన మార్గాలను మళ్లిస్తున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా నిర్ణయం ఫలితంగా న్యూయార్క్‌- ముంబై విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్టు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ఆ మార్గంలో విమానం నడిపి ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించలేమని తెలిపింది. ఇక తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్‌ని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమయ్యారు. అయితే ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నారు. కాగా ఒబామా కాలంలో ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని ట్రంప్‌ సర్కార్‌ విరమించుకున్న నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు