తప్పు కోడ్‌ పంపినందుకు పైలెట్‌ సస్పెండ్‌

20 Jul, 2019 17:05 IST|Sakshi

శ్రీనగర్‌ : విమానానికి సంబంధించిన 'హైజాక్‌ కోడ్‌'ను ఏటీఎస్‌ అధికారులకు తప్పుగా పంపినందుకు ఎయిర్‌ ఏషియా ఇండియాకు చెందిన పైలెట్‌ను మూడు నెలల పాటు సస్పెండ్‌​ చేస్తున్నట్లు డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) తెలిపింది. జూన్‌ 9న ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ వెళుతున్న E-I5-715 విమానంలో సాంకేతిక లోపంతో ఒక ఇంజిన్‌ నిలిచిపోయింది. విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ రవి రాజ్ అత్యవసర కోడ్ 7700ను ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎటిఎస్) అధికారులకు పంపాల్సి ఉండగా, దానికి బదులు 7500 ను పంపినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ విషయాన్నితీవ్రంగా పరిగణించిన డీజీసీఏ జూన్‌ 28న సదరు పైలెట్‌కు షోకాజ్‌ నోటీసులు పంపినట్లు పేర్కొంది. అయితే దీనికి సంబంధించి కెప్టెన్‌ రవిరాజ్‌ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో అతన్ని మూడునెలల పాటు విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీజీసీఏ వివరించింది. 

కాగా, విమానానికి సంబంధించి సాంకేతిక లోపాన్ని సరైన సమయంలో గుర్తించనందుకు, పైలట్‌ రవిరాజ్‌ పనితీరును సరిగ్గా పర్యవేక్షించనందుకు పైలట్‌ కమ్‌ కమాండర్‌ కిరణ్‌ సాంగ్వాన్‌ను హెచ్చరించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయనను ఆదేశించింది.

మరిన్ని వార్తలు