‘కరోనా పేషెంట్లను కశ్మీర్‌లోకి పంపేందుకు పాక్‌ యత్నం’

23 Apr, 2020 13:57 IST|Sakshi

శ్రీనగర్‌ : కరోనా వైరస్‌తో భారత్‌ను దెబ్బతీసేందుకు దాయాది పాకిస్తాన్‌ ప్రయత్నిస్తుందని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ అన్నారు. కరోనా సోకినవారిని జమ్మూకశ్మీర్‌లోకి పంపి అక్కడ కరోనా వ్యాప్తిని పెంచేందుకు పాక్‌ ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. శ్రీనగర్‌కు 20 కి.మీ దూరంలో గందేర్బాల్ జిల్లాలోని కోవిడ్‌-19 క్వారంటైన్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా పేషెంట్లను భారత్‌కు పంపేందుకు పాక్‌ ప్రయత్నిస్తుందనేది వాస్తవం అని అన్నారు. ఇప్పటివరకు పాకిస్తాన్‌ కశ్మీర్‌లోకి తీవ్రవాదులను పంపేదని.. కానీ ఇప్పుడు కరోనా పేషెంట్లను పంపుతుందని విమర్శించారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అని.. దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

వారం రోజుల కిందట కూడా ఓ ఆర్మీ ఉన్నతాధికారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తొలుత పీవోకేలోకి కరోనా పేషెంట్లను పంపించి.. అక్కడి నుంచి భారత్‌లోకి వారు చొరబడేలా పాక్‌ ప్రయత్నాలు చేస్తుందని ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. కాగా, కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు కెరాన్ సెక్టార్ ద్వారా భార‌త్‌లోకి ప్ర‌వేశించే ప్రయత్నం చేశారు. వీరిని భారత బలగాలు సమర్ధవంతగా అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించగా, ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. 

చదవండి : కరోనా చాలా కాలం ఉంటుంది : డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్‌

గుజరాత్‌ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు