ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ

13 Jul, 2020 04:22 IST|Sakshi

కోవిడ్‌ కట్టడిలో ఆదర్శంగా నిలిచిన ధారావి

ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా లో అతి పెద్ద మురికివాడ ధారావి. ఏప్రిల్‌ 1న అక్కడ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగానే అందరూ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కరోనా బాం బు పేలి శవాల దిబ్బగా మారుతుందని అనుకున్నారు. కానీ బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేసిన కృషి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది.

డబ్ల్యూహెచ్‌ఓ ధారావిలో కరోనా కట్టడి చర్యల్ని కొనియాడింది. కోవిడ్‌–19ను నియంత్రించడం లో ప్రపంచ దేశాలకు ఆదర్శనీయంగా నిలిచిన ధారావి మురికివాడ మెరిసిన ముత్యం లా తళుకులీనుతోంది. ముంబైలో కేసులు విశ్వరూపం దాల్చి సినీ ప్రముఖుల్ని కూడా భయపెడుతున్న వేళ ధారావిలో కరోనా కేసులు రోజుకి రెండు లేదంటే మూడు మాత్రమే నమోదవుతున్నాయి. సామాజిక భాగస్వామ్యంతో  ధారావి కరోనా చీకట్లను పారద్రోలి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది.  

సవాళ్లు
► సుమారు 2.5 చ. కి మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో జనాభా 10 లక్షలు.  ఒకే చిన్న గదిలో 8–10 మంది నివాసంతో భౌతిక దూరాన్ని పాటించడం అసాధ్యం
► కమ్యూనిటీ టాయిలెట్స్‌ మీద ఆధారపడిన 80% ప్రజలు
► ప్రతి రోజూ 450 కమ్యూనిటీ టాయిలెట్స్‌ వినియోగం
► స్ట్రీట్‌ ఫుడ్‌పై ఆధారపడిన అత్యధిక జనం

4 టీ ఫార్ములా
► ట్రేసింగ్‌
47,500 గృహాలకు వైద్యులు స్వయంగా వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి విచారించారు. ప్రతీ ఒక్క కేసు నమోదవగానే వారితో కాంటాక్ట్‌ అయిన 24 మందిని గుర్తించారు. వైద్యలు ప్రతీ రోజూ వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేవారు. ఇలా 59 వేల మందిని గుర్తించారు.

► ట్రాకింగ్‌
6 లక్షల మందిని స్క్రీన్‌ చేశారు. ప్రతీ ఒక్క పాజిటివ్‌ కేసుకి 5 మందిని క్వారంటైన్‌కి తరలించారు.  

► టెస్టింగ్‌
13,500 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు

► ట్రీటింగ్‌
ధారావిలో ఉన్న వారు బయటకు అడుగు పెట్టకుండా విస్తృతంగా మౌలికసదుపాయాలు కల్పించారు.కేవలం 14 రోజుల్లో  200 పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించి సీరియస్‌ కేసులకు చికిత్స అందించారు.  స్వల్ప లక్షణాలున్నవారిని క్వారంటైన్‌ హోమ్స్‌కి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాఠశాలలు, ఫంక్షన్‌ హాళ్లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను క్వారంటైన్‌ హోమ్స్‌గా మార్చారు. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి అందరి కడుపు నింపారు. కమ్యూనిటీ టాయిలెట్లను రోజుకి నాలుగైదు సార్లు శానిటైజ్‌ చేశారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు