పార్టీ పదవి నుంచి సీఎంకు ఉద్వాసన

27 Aug, 2017 15:20 IST|Sakshi
పార్టీ పదవి నుంచి సీఎంకు ఉద్వాసన

చెన్నై: అన్నాడీఎంకే పార్టీపై తన పట్టు సాధించేందుకు శశికళ మేనల్లుడు దినకరన్‌ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామితో నేరుగా తలపడిన ఆయన ఆదివారం మరో సంచలనానికి తెర తీశారు. పార్టీ పదవి నుంచి పళనిస్వామిని తప్పిస్తున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకే సేలం జిల్లా కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామిని తొలగించినట్టు తెలిపారు.

తన దగ్గరున్న 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌ను కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్‌ ఎస్‌ రాజేంద్రన్‌ను కూడా పార్టీ పదవి నుంచి శనివారం దినకరన్‌ తప్పించారు. రాజేంద్రన్‌ స్థానంలో పి ముతుయాన్‌ను నియమించినట్టు వెల్లడించారు. శాసనసభలో బలం నిరూపించుకునేలా పళనిస్వామిని ఆదేశించాలని కోరుతూ ఆగస్టు 22న దినకరన్‌ దగ్గరనున్న 19 మంది ఎమ్మెల్యేలు.. గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావును కలిసి కోరారు. 

పళనిస్వామిని సీఎం పీఠం నుంచి దించాలన్న లక్ష్యంతో గత కొద్దిరోజులు పార్టీ పదవుల నుంచి ఆయన వర్గీయులను దినకరన్‌ తొలగిస్తున్నారు. ఇంతకుముందు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించి, తన అనుచరులను నియమించారు. మరోవైపు దినకరన్‌ దాడి నుంచి గట్టెక్కేందుకు ఈపీఎస్‌ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు