ధోతీ కట్టుకున్నాడని రైల్లోనుంచి దింపేశారు!

6 Jul, 2019 10:33 IST|Sakshi
రామ్‌ అవధ్‌ దాస్‌

లక్నో : ధోతీ ధరించిన కారణంగా ఓ వృద్ధుడిని రైల్లోనుంచి కిందకు దింపేశారు సిబ్బంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎతవా నగరంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ బరబంకీకి చెందిన రామ్‌ అవధ్‌ దాస్‌(82) ఎతవా నుంచి ఘజియాబాద్‌ వెళ్లటానికి శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్‌ రిజర్వ్‌ చేసుకున్నాడు. గురువారం ఉదయం ఘజియాబాద్‌ వెళ్లటానికి ఎతవా రైల్వే స్టేషన్‌ చేరుకున్నాడు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌కు చేరుకోగానే అందులోకి ఎక్కాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆయనదగ్గరకు చేరుకున్న రైల్వే సిబ్బంది రామ్‌ అవధ్‌ దాస్‌ వేసుకున్న దుస్తులను, అతని వాలకాన్ని చూసి కిందకు దింపేశారు. వారి ప్రవర్తనతో కలత చెందిన పెద్దాయన కిందకు దిగి వేరే బోగిలోకి ఎక్కబోయేలోగా రైలు కదిలి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన రామ్‌ అవధ్‌ దాస్‌ సిబ్బంది ప్రవర్తనపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు.

రామ్‌ అవధ్‌ దాస్‌ మాట్లాడుతూ.. ‘‘ నాకు టిక్కెట్‌ ఉన్నా రైల్వే సిబ్బంది, టిక్కెట్‌ కలెక్టర్‌ నన్ను బోగిలోకి అనుమతించలేదు. వారి తీరుతో నాకు చాలా బాధకలిగింది. నేను వేసుకున్న (ధోతీ)దుస్తులు వారికి నచ్చకపోవటం వల్లే  నన్ను కిందకు దించేశారు. మనం ఇంకా బ్రిటీష్‌ పాలనలో ఉన్నామా? అనిపించింద’’ని తెలిపారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు.. ‘‘అతడు పొరపాటున వేరే బోగిలోకి ఎక్కటం మూలానే సిబ్బంది అతన్ని కిందకు దింపేశారు. వాళ్లు అతన్ని కించపరచలేదు. అతడు వేరే బోగిలోకి ఎక్కే సమయంలో రైలు కదిలి వెళ్లిపోయింద’’ని వెల్లడించారు.

మరిన్ని వార్తలు