‘వాళ్లు రాళ్లేస్తుంటే మేం పూలు ఇవ్వలేం’

28 May, 2017 19:40 IST|Sakshi
‘వాళ్లు రాళ్లేస్తుంటే మేం పూలు ఇవ్వలేం’

న్యూఢిల్లీ: రాళ్ల దాడులు ఆగిపోయేవరకు కశ్మీర్‌ సమస్యపై ఎలాంటి మాటలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఒక్కసారి దాడులు ఆగితే ప్రారంభమయ్యేది చర్చలే అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరితో తాము చర్చించేందుకు సిద్ధమని అన్న ఆయన ముందు రాళ్ల దాడులు ముగిసిపోవాలని, సైనికులపై దాడులు ఆగాలని చెప్పారు. గతంలో పనిచేసిన ఎన్డీయే మాదిరిగానే ఇప్పటి ఎన్డీయే కూడా వేర్పాటువాదులతో చర్యలు జరుపుతారా అని అమిత్‌ షాను ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.

‘మేం ఇప్పటికే చెప్పాం. రాళ్ల దాడి ముగిసిన వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని. కానీ అక్కడ ఇంకా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు చేయలేం. వాళ్లు రాళ్లు విసురుతుంటే మేం పువ్వులివ్వలేం. వారే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అని అమిత్‌ షా అన్నారు. ప్రస్తుతం పీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంతో సంతృప్తి చెందుతున్నారా అని ప్రశ్నించగా చాలా బాగా పనిచేస్తుందని అన్నారు. బీజేపీ, పీడీపీ భాగస్వామ్యంతో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు