ఎన్పీఆర్‌ వర్సెస్‌ సెన్సస్‌!

25 Dec, 2019 03:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జనగణన–2021కి, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జనగణన(సెన్సస్‌)కు, ఎన్పీఆర్‌కు మధ్య కొన్ని తేడాలను గమనిస్తే...

జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌)
ఎన్పీఆర్‌ అంటే దేశంలోని సాధారణ నివాసుల వివరాలతో కూడిన ఒక రిజిస్టర్‌. పౌరసత్వం చట్టం–1955 పరిధిలో  పౌరసత్వ నిబంధనలు, 2003 ఆధారంగా ఈ ఎన్పీఆర్‌ను రూపొందించనున్నారు. ప్రతి సాధారణ పౌరుడి వివరాల డేటాబేస్‌ను రూపొందిస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు. స్థానిక(గ్రామ/మండల), తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్పీఆర్‌ను అప్‌డేట్‌ చేస్తారు.

ఎన్పీఆర్‌లో వ్యక్తి పేరు, నివాస స్థితి, కుటుంబ యజమానితో గల బంధుత్వం, లింగ భేదం, పుట్టిన తేదీ, వైవాహిక స్థితి, విద్యార్హత, వృత్తి, తల్లిదండ్రులు లేదా భాగస్వాముల పేర్లు, జన్మస్థలం, జాతీయత, ప్రస్తుత చిరునామా, ఎంతకాలంగా ప్రస్తుత చిరునామాలో ఉంటున్నారు, శాశ్వత చిరునామా వంటి 14 అంశాలను పూరించాల్సి ఉంటుంది. ప్రతీ పౌరుడు ఈ పట్టికలో నమోదు కావాల్సిందే. వారికి జాతీయ గుర్తింపు కార్డును ఇస్తారు.  సాధారణ నివాసుల సమగ్ర వివరాలున్న డేటాబేస్‌ను రూపొందించేందుకు ఎన్పీఆర్‌ను రూపకల్పన చేశారు. ఈ డేటాబేస్‌లో ఆ  నివాసుల ఇతర, బయోమెట్రిక్‌ వివరాలుంటాయి.

జనగణన (సెన్సస్‌): ఎన్పీఆర్‌తో పోలిస్తే జన గణనలో మరిన్ని వివరాలను సేకరిస్తారు. వ్యక్తి గృహ వివరాలు, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, గృహోపకరణాల వివరాలు, పూర్తి ఆదాయ మార్గాలు, వ్యవసాయ– వ్యవసాయేతర వర్గాలు, సాగు, తాగు నీటి లభ్యత, వ్యవసాయ విధానం, వాణిజ్య వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వివరాలు, భాష, మతం, దివ్యాంగత.. తదితర పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు. జనగణన– 2021ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. 2020 ఏప్రిల్‌– సెప్టెంబర్‌ మధ్య తొలి దశను పూర్తి చేస్తారు. ఈ దశలో కుటుంబ సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. 2021 ఫిబ్రవరి 9 – 28 మధ్య రెండో దశ నమోదు జరుగుతుంది. ఆ దశలో వర్గాల వారీగా మొత్తం జనాభా సంఖ్యను గణిస్తారు.  

ఎన్నార్సీ అంటే..
చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే జాతీయ పౌర పట్టిక(నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్, ఎన్నార్సీ). ఇందులో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం..భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతోపాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా పొందుపరచబడి ఉంటాయి. ఈ పట్టికను మొట్టమొదటిసారిగా 1951లో ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటి వరకు దానిని మళ్లీ అప్‌గ్రేడ్‌ చేయలేదు. అయితే, ఇది అస్సాంలో మాత్రమే ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో అప్‌గ్రేడ్‌ అవుతోంది.

భారతీయ పౌరుడంటే ఎవరు?
1955 పౌరసత్వ చట్టం ప్రకారం.. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడే. దీని ప్రకారం.. ఎ) 1950 జనవరి 26వ తేదీన కానీ, అంతకుపూర్వం కానీ..1987 జూలై 1వ తేదీకి ముందు జన్మించిన వారు భారతీయ పౌరులు.

బి) 1987 జూలై 1వ తేదీన కానీ, అంతకుముందు పుట్టిన వారు. అయితే.. 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి రాకముందు జన్మించిన వారు; తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు ఆ సమయానికి భారత పౌరులై ఉన్నా..

సి) 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వారు; తల్లిదండ్రులిద్దరూ పౌరులై ఉన్నా లేక తల్లిదండ్రులిద్దరిలో ఒకరు అక్రమ వలసదారు కాకున్నా పౌరుడిగానే పరిగణింపబడతారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా