కేబినెట్ కూర్పుపై చర్చోపచర్చలు

20 May, 2014 01:29 IST|Sakshi
కేబినెట్ కూర్పుపై చర్చోపచర్చలు

మోడీ, రాజ్‌నాథ్, ఆరెస్సెస్ నేతలతో ఎంపీల భేటీలు
నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
మధ్యాహ్నం ఎన్డీఏ భాగస్వాములతో భేటీ

 
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయనున్న కేబినెట్ కూర్పుపై ‘కమల’నాథులు తెరిపి లేకుండా చర్చోపచర్చలు సాగిస్తున్నారు. గుజరాత్ భవన్‌లో బస చేసిన భావి ప్రధాని నరేంద్ర మోడీ తనకు అత్యంత సన్నిహితులైన పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు సాగిస్తున్నారు. కేబినెట్ ఏర్పాటు విషయంలో మోడీకి ఆరెస్సెస్ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో మోడీని, పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులైన ఎంపీలు గుజరాత్ భవన్ వద్ద బారులు తీరుతున్నారు. ఆదివారం మొదలైన ఈ చర్చలు సోమవారం కూడా కొనసాగాయి. మోడీ తన సన్నిహితుడు అమిత్ షా, అరుణ్ జైట్లీ తదితర నేతలతో సమావేశమయ్యారు. కేబినెట్ పరిమాణం, బీజేపీ వద్ద ఎన్ని శాఖలు ఉండాలి, భాగస్వామ్య పక్షాలకు ఎన్ని కేటాయించాలి, తదితర అంశాలపై వారు  చర్చించినట్లు సమాచారం. పదేళ్ల తర్వాత పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీలో మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగానే ఉంది. పార్టీ అగ్రనేత అద్వానీకి లోక్‌సభ స్పీకర్ పదవి కట్టబెట్టడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. అమృత్‌సర్ నుంచి పోటీచేసి, ఓటమి పాలైన అరుణ్ జైట్లీని కేబినెట్‌లోకి తీసుకోవాలని మోడీ భావిస్తున్నారు.

ఆయనకు ఆర్థిక శాఖను కేటాయించే అవకాశాలున్నాయి. అలాగే, అరుణ్ శౌరికి విదేశాంగ శాఖ కట్టబెట్టే అవకాశాలపైనా చర్చ సాగుతున్నట్లు సమాచారం. పట్టణాభివృద్ధి శాఖను నితిన్ గడ్కారీకి అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఆయనకు తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది. ఒకవేళ గడ్కారీకి కేబినెట్‌లో చోటు కల్పిస్తే, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మోడీ కేబినెట్‌లో చోటు పొందనున్న వారిలో రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, మురళీమనోహర్ జోషీ, వెంకయ్య నాయుడు, యడ్యూరప్ప, వీకే సింగ్, స్మృతీ ఇరానీ, కల్రాజ్ మిశ్రా, పూనమ్ మహాజన్, రవిశంకర్ ప్రసాద్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మోడీ కేబినెట్‌లో పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఏకైక ముస్లిం మంత్రి కాగలరని కూడా చెబుతున్నారు. అమిత్ షాకు రైల్వేశాఖ లేదా ప్రధాని కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ ప్రయోగం విజయవంతమైనందున వచ్చే ఏడాది జరగనున్న బీహార్ ఎన్నికల్లో సైతం అమిత్ షాకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ఇక శివసేన, టీడీపీ, అకాలీదళ్, ఎల్జేపీ వంటి మిత్రపక్షాలకూ కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి.

రాజ్‌నాథ్ నివాసం, ఆరెస్సెస్ కార్యాలయం బిజీ బిజీ

అశోకారోడ్‌లోని రాజ్‌నాథ్ సింగ్ నివాసం, ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం చుట్టూ కూడా ఆశావహ ఎంపీలు ప్రదక్షిణలు ప్రారంభించారు. మోడీతో భేటీకి ముందు సుష్మా స్వరాజ్ సోమవారం రాజ్‌నాథ్ నివాసానికి వెళ్లి, చర్చలు జరిపారు. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, గోవా సీఎం మనోహర్ పారికర్, కల్యాణ్ సింగ్, ఉమాభారతి, గోపీనాథ్ ముండే, యోగి ఆదిత్యనాథ్, వరుణ్ గాంధీ, శతృఘ్న సిన్హా, పూనమ్ మహాజన్, రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్, వైగో తదితరులు మోడీ, రాజ్‌నాథ్‌లను కలుసుకుని అభినందనలు తెలిపారు. యూపీ సీనియర్ నేత వినయ్ కటియార్‌తో పాటు అమిత్ షా, జైట్లీలు కూడా ఆరెస్సెస్ నేతలతో ఆరెస్సెస్ ఆఫీసులో చర్చలు జరిపారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం భేటీ కానుంది. ఇందులో పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని లాంఛనప్రాయంగా ఎన్నుకోనున్నారు. ఇదే భేటీలో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించనున్నారు. అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఉంటుంది. ఇందులో పాల్గొనేందుకు శివసేన చీఫ్  ఉద్ధవ్ ఠాక్రే, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్  పవన్ కల్యాణ్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.

ప్రపంచ నేతలకు మోడీ కృతజ్ఞతలు

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తనను అభినందించిన ప్రపంచ నేతలందరికీ త్వరలోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు.  అమెరికా అధ్యక్షుడు ఒబామా సహా పలు దేశాల ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలకు‘ట్విట్టర్’ ద్వారా ధన్యవాదాలు చెప్పారు. కాగా మోడీకి వివిధ దేశాల నుంచి ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నాయి.
 

మరిన్ని వార్తలు