‘దిగ్విజయ్‌ వర్సెస్‌ శివరాజ్‌ చౌహాన్‌’

24 Mar, 2019 15:44 IST|Sakshi

భోపాల్‌ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టున్న భోపాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను బరిలో దింపడంతో ఆయనకు దీటైన అభ్యర్థిగా బీజేపీ నుంచి మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను పోటీలో నిలపాలని భావిస్తోంది. వీరిద్దరూ ప్రత్యర్ధులుగా తలపడితే ఇద్దరు మాజీ సీఎంల నడుమ బ్యాలెట్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు దిగ్విజయ్‌ సింగ్‌పై పోటీకి మాలెగావ్‌ పేలుళ్ల కేసులో అభియోగాలు ఎదుర్కొని ఇటీవలే న్యాయస్ధానం నుంచి ఊరట పొందిన సాధ్వి ప్రగ్య ఠాకూర్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.

భోపాల్‌ స్ధానాన్ని గత మూడు దశాబ్ధాలుగా బీజేపీ కైవసం చేసుకుంటోంది. 1984లో చివరిసారిగా కాంగ్రెస్‌ నేత శంకర్‌ దయాళ్‌ శర్మ ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. అప్పటినుంచి భోపాల్‌ బీజేపీ ఖాతాలోనే కొనసాగుతోంది. 1989 నుంచి బీజేపీకి చెందిన సుశీల్‌ చంద్ర వర్మ వరుసగా మూడుసార్లు భోపాల్‌ నుంచి ఎన్నికయ్యారు. 1999లో భోపాల్‌ నుంచి నెగ్గిన ఉమా భారతి సీఎం పగ్గాలు చేపట్టిన అనంరతం పార్లమెంట్‌ స్ధానం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం భోపాల్‌ నుంచి బీజేపీ సభ్యుడు అలోక్‌ సంజార్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరోవైపు భోపాల్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ బరిలో దిగడం, లోక్‌సభ పరిధిలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో దీటైన అభ్యర్ధివైపే బీజేపీ మొగ్గుచూపుతోంది. భోపాల్‌ నుంచి పోటీ చేసేందుకు మేయర్‌ అలోక్‌ శర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి వీడీ శర్మలను పరిశీలిస్తున్న బీజేపీ దిగ్విజయ్‌ రాకతో దిగ్గజ నేతనే బరిలో దింపాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు